పంజాబ్లో దారుణం జరిగింది. ఓ యువతిని ముగ్గురు దుండగులు వచ్చి గన్తో బెదిరించి కిడ్నాప్ చేశారు. అడ్డువచ్చిన బాధితురాలి సోదరి, సోదరుడు, తల్లిని తీవ్రంగా కొట్టారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. బాధితురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని తెలిపారు.
గన్తో బెదిరించి యువతి కిడ్నాప్.. అడ్డొచ్చిన కుటుంబసభ్యులపై.. - పంజాబ్ తాజా వార్తలు
ముగ్గురు యువకులు అకస్మాత్తుగా ఇంట్లోకి చొరబడి గన్తో బెదిరించి యువతిని కిడ్నాప్ చేశారు. ఈ ఘటన పంజాబ్లో జరిగింది. బాధితురాలి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అసలేం జరిగిందంటే
బుధవారం రాత్రి 7.30 సమయంలో ముగ్గురు యువకులు.. 18 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేయడానికి వచ్చారు. వారిని అడ్డగించేందుకు ప్రయత్నించిన బాధితురాలి కుటుంబ సభ్యులను తీవ్రంగా కొట్టారు. గన్తో బెదిరించి యువతిని కిడ్నాప్ చేశారు. 'తన భర్త సిందా సింగ్ పని నిమిత్తం వేరే గ్రామానికి వెళ్లారు. ఆ సమయంలో ముగ్గురు దుండగులు ఇంట్లోకి చొరబడ్డారు. గదిలో ఉన్న నా పెద్ద కుమార్తె ప్రీతిని బలవంతంగా తీసుకెళుతుండగా ఆమె అరుస్తూ వారితో వెళ్లేందుకు నిరాకరించింది. అప్పడు నిందితులు తుపాకీతో కాల్చి చంపుతానని బెదిరించి ప్రీతిని కిడ్నాప్ చేశారు' అని బాధితురాలి తల్లి రాణి తెలిపింది.
2022 జూలైలో ఓ వ్యక్తి తన కుమార్తె ప్రీతిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడని.. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని అన్నారు బాధితురాలు తండ్రి సిందా సింగ్. బుధవారం మళ్లీ అతడే వచ్చి తమ కుటుంబ సభ్యులను తీవ్రంగా కొట్టి ప్రీతిని కిడ్నాప్ చేశాడని వాపోయాడు. తమ కుమార్తెను నిందితుల చెర నుంచి విడిపించాలని పోలీసులకు కోరాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.