Boy Fell Into Borewell : బిహార్ నలంద జిల్లాలోని కుల్ గ్రామంలో బోరు బావిలో పడ్డ మూడేళ్ల బాలుడిని సహాయక బృందాలు సురక్షితంగా కాపాడాయి. బయటకు తీసిన వెంటనే అధికారులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయిన బాలుడు 40 అడుగుల లోతులో ఇరుక్కుపోయాడు. రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు బోరుబావికి సమాంతరంగా జేసీబీలతో గొయ్యిని తవ్వారు. గంటల శ్రమ అనంతరం బాలుడికి పునర్జీవితం ప్రసాదించారు. ఈ క్రమంలో బాలుడి తల్లి దండ్రులు తీవ్ర ఆనందం వ్యక్తం చేశారు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నలంద పోలీస్ స్టేషన్ పరిధిలోని కుల్ గ్రామానికి చెందిన ఓ మహిళకు మూడేళ్ల కుమారుడు శివమ్ కుమార్ ఉన్నాడు. ఆ మహిళ పొలం పనులకు తన కుమారుడిని వెంట తీసుకెళ్లింది. అయితే, ఆ పొలంలో బోర్ వేసి నిర్లక్ష్యంగా వదిలిపెట్టారు. దీంతో ఆడుకుంటూ వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు 40 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయాడు. తన కుమారుడిని బయటకు తీసుకురండి అంటూ శివమ్ తల్లి కన్నీరుమున్నీరవుతోంది.
సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. బాలుడిని సురక్షితంగా బయటకు తీసేందుకు సిబ్బంది జేసీబీతో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటనపై శంభు మండల్ సర్కిల్ అధికారి సిల్వ స్పందించారు. 'ఒక చిన్నారి బోరుబావిలో పడిపోయినట్లు మాకు సమాచారం అందింది. చిన్నారిని రక్షించేందుకు మేము తీవ్రంగా ప్రయత్నిస్తున్నాము. ఎన్డీఆర్‌ఎఫ్, రెస్క్యూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుంటుంది. బాలుడు ఇంకా బతికే ఉన్నాడు. అతడి గొంతు మాకు వినిపిస్తోంది' అని సిల్వా తెలిపారు.
300 అడుగుల బోరుబావిలో పడ్డ బాలుడు..
ఈ ఏడాది మే నెలలో రాజస్థాన్‌లో 9 ఏళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడు. ఈ ఘటనలో సహాయక బృందాల శ్రమ ఫలించింది. ఏడు గంటలపాటు సహాయక చర్యలు చేపట్టిన ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు.. బాలుడిని సురక్షితంగా బయటకు తీశాయి. బాలుడు 300 అడుగుల లోతైన బావిలో 70 అడుగుల లోతున చిక్కుకున్నట్లు ఎన్డీఆర్‌ఎఫ్ తెలిపింది.
గ్రామస్థుల కథనం ప్రకారం.. జైపుర్ జిల్లాలోని భోజ్‌పురా గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామ శివార్లలో ఉన్న బోరుబావి చాలా కాలంగా మూసి ఉంది. గ్రామస్థులు ఆ బోరుబావిని రాయితో కప్పివేశారు. అయితే గ్రామంలోని కొందరు పిల్లలు ఆడుకుంటా ఆ బోరుబావి వద్దకు వెళ్లారు. ఆ తర్వాత అనుకోకుండా ఆ రాయిని తొలగించారు. ఆ సమయంలో అక్షిత్ అలియాస్ లక్కీ అనే బాలుడు.. ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు.పూర్తి కథనం చదవాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి.