ఉత్తర్‌ప్రదేశ్ కాన్పుర్‌లో ఘోరం జరిగింది. సెప్టిక్ ట్యాంక్ మూతను తెరిచే క్రమంలో ముగ్గురు యువకులు విషపూరిత వాయువులు పీల్చి మరణించారు. మృతులు చౌబేపుర్ ప్రాంతానికి చెందిన నందు (18), అతని సోదరుడు మోహిత్ (24), సాహిల్ (16)గా పోలీసులు గుర్తించారు. నందు, మోహిత్.. సెప్టిక్ ట్యాంక్ నిర్మాణాలు చేపడుతుంటారు. వారి దగ్గర సాహిల్ అనే యువకుడు కూలీగా పనిచేస్తున్నాడు.
ముందుగా సాహిల్.. సెప్టిక్ ట్యాంక్‌లోకి వెళ్లి విషపూరిత వాయువులు పీల్చి స్పృహ కోల్పోయాడు. అతడిని రక్షించేందుకు ట్యాంక్‌లో దిగిన నందు, మోహిత్ కూడా అపస్మారక స్థితికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని ముగ్గురు యువకులను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వీరు ముగ్గురు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
గుంతను తప్పించబోయి..
కర్ణాటక బెంగళూరులోని యళహంకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఉన్న గుంతను తప్పించే ప్రయత్నంలో ఓ కారు అదుపు తప్పి బోల్తా పడింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న బైక్.. కారు కింద ఇరుక్కుపోయింది. బైక్ వెనక సీట్లో కూర్చున్న వ్యక్తి ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందగా.. వాహనం నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. యళహంకలో శనివారం రాత్రి జరిగిందీ ప్రమాదం. ఈ ఘటనపై యళహంక ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతుడు కేరళకు చెందిన అర్షద్ షా అని పోలీసులు తెలిపారు. బైక్ నడుపుతున్న వ్యక్తిని రాహుల్‌గా గుర్తించారు. యళహంకలోని వివేకానంద కళాశాల ఎదురుగా రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయని, వర్షం కారణంగా గుంతలు ఏర్పడి జలమయమయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాద దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.