Three Way Fight in Telangana Assembly Election : రాష్ట్ర శాసనసభ ఎన్నికలు త్రిముఖ పోరుకు వేదికవుతున్నాయి. పదేళ్లుగా పాలిస్తున్న గులాబీ పార్టీ ముచ్చటగా మూడోసారి గెలిచి పీఠాన్ని అధిష్ఠించాలని ప్రయత్నిస్తోంది. అధికారం నిలుపుకోవాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ నేతలు ప్రజల్లోకి విస్తృతంగా వెళుతున్నారు. ప్రతిపక్షాలకు(Opposition Party) ఎలాంటి అవకాశం ఇవ్వకూడదనే ఆలోచనతో గులాబీ బాస్, సీఎం కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. పదునైన వ్యూహాలతో ప్రతిపక్షాలకు చెక్ పెట్టాలని చూస్తున్నారు.
BRS Political Moves in TS Elections : రాజకీయంలో ఉన్న అపార అనుభవంతో విపక్షాలను అంతర్మథనంలో పడేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఓటర్ల దరిచేరకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అన్ని వర్గాల ప్రజల ఓట్లను కొల్లగొట్టే ఉద్దేశంతో సామాజిక వర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ఆయా వర్గాలకు చేరువయ్యేలా హామీలు గుప్పిస్తున్నారు. మహిళా, యువజన, రైతులతో ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. అంబేడ్కర్(B.R Ambedkar) ఆశయాలకు అనుగుణంగా పదేళ్లు ప్రభుత్వం సబ్బండ వర్గాల సంక్షేమం కోసం పనిచేసిందని ఓటర్లకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు.
BRS on Congress Comments : 'రైతుల శత్రువు కాంగ్రెస్.. ఫ్రీ కరెంట్‌పై ఆ పార్టీది దుర్మార్గపు ఆలోచన'
ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను పార్టీలకు అతీతంగా కుల, మత భేదం లేకుండా అన్ని వర్గాలకు అందించామని వివరిస్తున్నారు. తటస్థ ఓటర్ల మద్దతు కోసం పదేళ్లలో చేసిన ప్రగతి పనులను సమగ్రంగా వివరిస్తున్నారు. సంక్షేమ ఫలాలు అందించే క్రమంలో ప్రాంతీయ భేదం ఎక్కడా చూపలేదని గుర్తుచేస్తున్నారు. తద్వారా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో అధికంగా ఉన్న సెటిలర్ల ఓట్లను తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.
BRS Manifesto in Assembly Election : పోల్ మేనేజ్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి సారించిన గులాబీ పార్టీ రాష్ట్రంలో పురుషులతో సమానంగా ఉన్న మహిళా ఓటర్లను ఆకట్టుకునేలా ఎన్నికల ప్రణాళికను(Election Planning) రూపొందించింది. పార్టీ మ్యానిఫెస్టోలో అతివలకు అగ్రతాంబూలం ఇచ్చింది. ఒంటరి స్త్రీలకు ఆసరా పెన్షన్, అర్హులైన వారికి మూడు వేల భృతి, 400లకే గ్యాస్ బండ, మహిళాసంఘాలకు భవనాలు, ఇళ్ల స్థలాలను సైతం నారీమణులకే ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసింది. మహిళలు ప్రతిపక్షాల వైపు మళ్లకుండా ప్రతి నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారంలో వారినే ముందుంచుతున్నారు.
గడపగడపకు వెళ్లి ఆడవాళ్లను పలకరించేలా క్షేత్రస్థాయిలో గులాబీ నేతలు పనిచేస్తున్నారు. పదేళ్లలో చేసిన పనులతో పాటు గెలిపిస్తే వచ్చే ఐదేళ్లలో మహిళా అభ్యున్నతికి చేసే పనులు వివరిస్తున్నారు. సామాజిక మాధ్యమాలను బలంగా ఉపయోగించుకుని ప్రభుత్వం పదేళ్లలో చేసిన పనుల వివరాలు ప్రజలకు చేరేలా ప్రత్యేక కార్యచరణతో పనిచేస్తున్నారు. ప్రచారానికి సోషల్ మీడియా(Social Media) ఇన్‌ఫ్లూయెన్సర్లను ఉపయోగించుకుని నిమిషం నిడివితో రీల్స్ చేయించి ఓటర్లకు చేరేలా చూస్తున్నారు. బూత్‌స్థాయి సమావేశాల్లో ప్రతీ ఓటరును ప్రచారం ముగిసేలోపు మూడుసార్లు కలవాలని ముఖ్యనేతలు సూచిస్తున్నారు. ప్రతీ నియోజకవర్గం, మండల, గ్రామస్థాయిలో సోషల్ మీడియా సమన్వయకర్తలను నియమించుకుని ప్రచారంలో పట్టుజారకుండా అగ్రనేతలు నిరంతంరం పర్యవేక్షిస్తున్నారు.
Congress Strategies in Assembly Election : ప్రధాన విపక్షం కాంగ్రెస్.. గులాబీ పార్టీ ఆధిపత్యానికి గండి కొట్టే వ్యూహాలను రచిస్తోంది. టికెట్ల ఖరారు కాస్త ఆలస్యమైనా.. ఆ ప్రభావం క్షేత్రస్థాయిలో పడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చిన్నా చితక పార్టీలతో సంప్రదింపులు చేసి మద్దతు కూడగడుతోంది. ఆ క్రమంలో షర్మిల నేతృత్వంలోని వైఎస్ఆర్టీపీ, కోదండరాం తెలంగాణ జనసమితి(TJS Party) సంఘీభావం లభిస్తుందని హస్తం పార్టీ నేతలు అంచనావేస్తున్నారు. మూడు విడతల్లో టికెట్ రాని అసంతృప్తులను సముదాయిస్తున్న కాంగ్రెస్ పెద్దలు మిగతా పార్టీల మద్దతుపైనా దృష్టి సారించారు.