బిహార్ వైశాలిలోని మహనార్లో మూడు వేర్వేరు ప్రాంతాల్లో ఒకే రోజు ముగ్గురు మరణించిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. కల్తీ మద్యం సేవించడమే వీరి మరణానికి కారణమని పలువురు అనుమానిస్తుండగా పోలీసులు అప్రమత్తమై కేసు నమోదు చేసుకున్నారు. తదుపరి దర్యాప్తును ప్రారంభించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవ పరీక్షలకు తరలించారు.
లావాపుర్లో యువకుడి మృతి..
లావాపుర్లో నివసిస్తున్న అనిల్ దాస్ అనే వ్యక్తి శుక్రవారం మధ్యాహ్నం సుమారు రెండు గంటల సమయంలో బయటకు వెళ్లాడు. కాసేపటికి ఇంటికి వచ్చిన ఆ వ్యక్తి ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడం ప్రారంభించింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు ప్రాథమిక చికిత్స అందించారు.
అయినా కూడా అతని పరిస్థితి మెరుగుపడకపోవడం వల్ల స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారిన ఆ వ్యక్తిని మరో ఆస్పత్రిలో చేర్పించగా వైద్య పరీక్షలు చేస్తున్న సమయంలో మృతి చెందాడు. బయట ఏదో తాగడం వల్లే అతను మృతి చెందినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
మహనార్లో స్కూల్ ప్రిన్సిపల్ మృతి..
మహనార్లోని ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ కూడా ఇదే తరహాలో అనుమానాస్పదంగా మృతి చెందినట్లు ఆ పాఠశాల యాజమాన్యం తెలిపింది. ఈయన కూడా కల్తీ మద్యానికి బలైనట్లు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్ట్మార్టం పరీక్షల నివేదిక వచ్చాక అసలు విషయం బయటపడుతుందని స్పష్టం చేశారు.
మహనార్లో మరో ఘటన
నవంబర్ 30న మహనార్లోని ఓ వివాహానికి హాజరైన రాహుల్ కుమార్ మరుసటి రోజు ఇంటికి వచ్చి వాంతులు చేసుకున్నాడు. కుటుంబసభ్యులు అతన్ని దగ్గరలో ఉన్న డాక్టర్లకు చూపించారు. అయినపట్టికి పరిస్థితి మెరుగుపడకపోవడం వల్ల స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి తరలించారు.
అక్కడ కూడా అతని పరిస్థితి విషమించగా వైద్యులు అతన్ని మరొక ఆస్పత్రికి తీసుకెళ్లమని సూచించారు. అయితే అంతలోనే అతని ప్రాణాలు కోల్పోవడం ఆ ఇంట తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వివాహ వేడుకల్లో ఏదో తాగాడని, దాని వల్లే ఇలా జరిగిందని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు.
బిహార్లో మద్యపాన నిషేధం అమల్లో ఉంది. ఫలితంగా ఇటీవల అనేక మంది కల్తీ మద్యం తాగి చనిపోయారు.