Three Policemen Killed: మధ్యప్రదేశ్‌లోని గుణా జిల్లాలో దారుణం జరిగింది. కొందరు దుండగులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతి చెందారు. శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అరోన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగినట్లు రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా వెల్లడించారు. అరుదైన జాతికి చెందిన నాలుగు జింకలను కొందరు దుండగులు వేటాడినట్లు అందిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి పోలీసులు వెళ్లినట్లు గుణా ఎస్పీ రాజీవ్ మిశ్రా తెలిపారు. ఈ కాల్పుల్లో సబ్ ఇన్స్పెక్టర్ రాజ్‌కుమార్ జాదవ్, ఇద్దరు కానిస్టేబుళ్లు నీలేశ్ భార్గవ, శాంతారామ్ మీనాలు ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు.
దుండగుల కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతి.. సీఎం అత్యవసర సమావేశం - కాల్పులు
09:41 May 14
దుండగుల కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతి.. సీఎం అత్యవసర సమావేశం
" కొందరు దుండగులు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారంతో .. అరోన్ స్టేషన్ పరిధిలోని ఘటనా స్థలానికి పోలీసు బృందం వెళ్లింది. పోలీసులు చుట్టుముట్టిన క్రమంలో దుండగులు.. కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దురదృష్టకరం. వారిని త్వరలోనే పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటాం. రెండు జింక కళేబరాలు, 5 తలలు, ఒక నెమలి కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నాం. వారు వేటగాళ్లలా తెలుస్తోంది."
- నరోత్తమ్ మిశ్రా, హోంమంత్రి.
రూ. కోటి పరిహారం: దుండగుల కాల్పుల్లో ముగ్గురు పోలీసులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో భోపాల్‌లోని తన నివాసంలో ఉన్నత స్థాయి అత్యవసర సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. డీజీపీ, హోం మంత్రి, ప్రధాన కార్యదర్శి సహా పలువురు ఉన్నతాధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు పోలీసుల కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున పరిహారం ప్రకటించారు. 'వారిని అమర వీరులుగా గుర్తిస్తాం. ఒక్కో కుటుంబానికి రూ.1 కోటి పరిహారంతో పాటు కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తాం. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియల నిర్వహణ ఉంటుంది. ఘటనాస్థలికి ఆలస్యంగా వెళ్లిన ఐజీని విధుల్లోంచి తొలగించాలని నిర్ణయించాం. ఆ ప్రాంతానికి పోలీసు బలగాలను తరలించాం. నిందితులు తప్పించుకునే ప్రసక్తే లేదు. ఇప్పటికే గ్రామానికి సమీపంలో తూటా గాయాలతో ఒక మృతదేహం లభించింది.' అని పేర్కొన్నారు సీఎం.
ఇదీ చూడండి:ఆంగ్లేయుల అరాచకం.. మనుషులనే కాదు 80వేల పులుల్ని చంపి..