Three Persons Died Due to Alcohol intoxication: మద్యం మత్తు వారి ప్రాణాలను తీసింది. ఈత సరదా వారిని తమ కుటుంబాలకు కాకుండా చేసింది. నిన్నటి వరకు తమతో కలిసి ఉత్సాహంగా గడిపిన వారు అంతలోనే విగత జీవులుగా మారడం వారి కుటుంబ సభ్యులను కలచి వేసింది. ఇసుక ఊబిలే వారి మరణానికి కారణమని వారు మిత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా చోడవరం వద్ద కృష్ణా నదిలో ఆహ్లాదంగా గడుపుదామని వెళ్లి.. అసువులు బాసిన తమ వారిని చూసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
విజయవాడ సింగ్‌నగర్‌కు చెందిన రహీమ్ బాషా, కాలేషావలి, తాళ్లూరి కిరణ్ మంచి స్నేహితులు. రహీమ్ జారా బిర్యాని పాయింట్ నడుపుతుండటంతో ఆ ప్రాంతంలో అందరికీ సుపరిచితుడు. స్నేహితులతో ఎక్కువగా గడపే రహీమ్.. చాలా సార్లు వారితో కలిసి కారులో షికారుకు వెళ్తుంటాడు. అదే విధంగా ఈ ముగ్గురు కలిసి గురువారం సాయంత్రం విజయవాడకు సమీపంలోని చోడవరం వద్ద కృష్ణా నదిలోని ఇసుక తిన్నెలపై మద్యం సేవించేందుకు వెళ్లారు. రహీమ్ బిర్యానీ పాయింట్‌లో పని చేసే అజ్గర్‌కు ఫోన్ చేసి పిలిపించుకుని అందరూ కలిసి రాత్రి వరకు అక్కడే మద్యం సేవించారు. 9 గంటల సమయంలో సరదాగా నదిలో స్నానం చేయాలనుకున్న స్నేహితులు.. బట్టలు, ఫోన్లు, వస్తువులన్నీ కారులోనే పెట్టి నీటిలోకి దిగారు.
రహీమ్, కాలేషా వలి, తాళ్లురి కిరణ్ నదిలో దిగగా.. అజ్గర్ అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు. ఉదయాన్నే చేపలు పట్టేందుకు జాలర్లు నదిలోకి దిగగా.. ఓ మృతదేహం నీటిలో తేలియాడుతూ కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని కారులో ఉన్న ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కాలేషావలిని గుర్తించిన కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఇటీవలే జరిగన ఓ వేడుకలో అందరం కలిసి ఉత్సాహంగా గడిపామని, ఇంతలోనే ఇలా జరిగిందంటూ కన్నీరుమున్నీరయ్యారు.