దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన ఓ సర్వే ప్రకారం ప్రతి ఐదుగురు బాల వధువుల్లో ముగ్గురు గర్భం దాలుస్తున్నారు. చైల్డ్ రైట్స్ అండ్ యూ (కేఆర్‌వై/క్రై) అనే స్వచ్ఛందసంస్థ ఈ సర్వే నివేదికను వెల్లడించింది. యుక్త వయసు రాకముందే తల్లులుగా మారుతున్న బాల్య వివాహాలతో బాలికల లైంగిక, పునరుత్పాదక ఆరోగ్యంపై హానికరమైన ప్రభావం పడుతున్నట్లు తెలిపింది. బాలల దినోత్సవంతోపాటు బాలల సంరక్షణ వారోత్సవాల (నవంబర్ 14 - 20) నేపథ్యంలో ఈ అధ్యయనం చేశారు.
చిత్తూరు (ఆంధ్రప్రదేశ్), చందౌలీ (ఉత్తర్‌ప్రదేశ్), పర్భణీ (మహారాష్ట్ర), కంధమాల్ (ఒడిశా) జిల్లాల్లోని 8 బ్లాకుల నుంచి 40 గ్రామాలను ఎంపిక చేసుకొని ఈ సర్వే నిర్వహించారు. ఈ అధ్యయనం ప్రకారం.. కేవలం 16 శాతం తల్లిదండ్రులు, అత్తామామలు., 34 శాతం బాల వధూవరుల్లో మాత్రమే బాల్య వివాహాల దుష్పరిణామాలపై అవగాహన ఉన్నట్లు తేల్చారు. కడు పేదరికం, తప్పని వలసలు, లింగ అసమానతలు ఇటువంటి వివాహాలకు కారణమవుతున్నట్లు వెల్లడైంది. బాలురతో పోల్చితే విద్యకు అవకాశాలు, ఆర్థిక స్థోమత లేకపోవడం వంటి కారణాల వల్ల కూడా బాలికలు డ్రాపవుట్లుగా మారుతున్నారు.
ప్రేమ వ్యవహారాల భయం..
అమ్మాయిలు ప్రేమలో పడి ఇళ్లు వదిలి వెళ్లిపోతారని, వివాహానికి ముందే లైంగిక సంబంధాలతో గర్భం తెచ్చుకుంటారని తల్లిదండ్రుల్లో ఉన్న భయాలు కూడా ముందస్తు వివాహాలకు ప్రధాన కారణాలుగా ఉన్నట్లు సర్వేలో తేలింది. చిన్నవయసులో పెళ్లిళ్లు చేస్తే వరకట్నాలు తక్కువగా ఉంటాయని, అత్తవారింట కొత్త వాతావరణానికి తొందరగా అలవాటు పడతారనే ఆలోచన వల్ల కూడా చాలామంది అటు మొగ్గు చూపుతున్నారు. కనీసం ఇద్దరు సంతానం ఉన్న బాల వధువుల్లో 51 శాతం మంది ఇద్దరు పిల్లల మధ్య వ్యవధి రెండేళ్ల కంటే తక్కువగా ఉన్నట్లు చెప్పారు. ఇటువంటి తల్లులకు పుడుతున్న పిల్లలు చాలావరకు బరువు తక్కువగా ఉంటున్నారు.