భారత అమ్ముల పొదిలో మరో మూడు రఫేల్ యుద్ధ విమానాలు చేరాయి. మూడో విడతలో భాగంగా ఫ్రాన్స్ నుంచి మూడు జెట్లు భారత్కు బుధవారం సాయంత్రం చేరుకున్నాయి. దీంతో దేశంలోని రఫేల్ జెట్ల సంఖ్య 11కు చేరింది. చైనాతో సరిహద్దులో ఘర్షణ నేపథ్యంలో ఇవి వాయుసేనకు మరింత బలం చేకూర్చనున్నాయి.
రఫేల్ జెట్లు దాదాపు 7 వేల కిలోమీటర్లు నిరంతరాయంగా ప్రయాణించి భారత్కు చేరుకున్నాయని వాయుసేన తెలిపింది. మార్గమధ్యంలోనే ఇంధనాన్ని నింపుకున్నాయని వెల్లడించింది. ఇందుకు యూఏఈ వాయుసేన సహకరించిందని పేర్కొంది.