మధ్యప్రదేశ్ భోపాల్లో ఓ అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. నిమోనియా వ్యాధి బారిన పడిన చిన్నారికి మూఢనమ్మకంతో తెలిసీ తెలియని వైద్యం చేశారు తల్లిదండ్రులు. మూడునెలల వయసున్న పాప శరీరంపై 51 సార్లు ఇనుపరాడ్డుతో వాతలు పెట్టారు. దీంతో అభం శుభం తెలియని చిన్నారి పదిహేను రోజులు మృత్యువుతో పోరాడి మరణించింది. వివరాల్లోకి వెళ్తే..
ఇదీ జరిగింది..
షాడోల్‌లోని సింగ్‌పుర్ కథౌటియా గ్రామానికి చెందిన మూడు నెలల చిన్నారి రుచితా కోల్ నిమోనియా బారినపడింది. దీంతో పాపకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. అయితే ఆమె తల్లిదండ్రులు మూఢనమ్మకంతో ఆసుపత్రికి తీసుకెళ్లకుండా స్థానికంగా ఉండే మంత్రగాళ్లకు పాపను చూపించారు. అక్కడ వ్యాధి తగ్గాలంటూ చిన్నారి పొట్టపై కాలిన ఇనుపరాడ్డుతో 51 సార్లు వాతలు పెట్టారు. ఆ తర్వాత పాప పరిస్థితి మరింత దిగజారింది. ఓవైపు కాలిన గాయాలు.. మరోవైపు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడం వల్ల అప్పుడు స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే 15 రోజులు గడిచిపోయింది.