ఐటీ నగరం బెంగళూరులో విషాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదం జరిగి ఓ మహిళ సహా ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువక ముందే మరో ఘోరం జరిగింది. నగరంలోని తరగుపేటలోని రవాణా కార్యకలాపాలకు సంబంధించిన గోదాములో భారీ పేలుడు (Bangalore Blast now) సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానిక విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. (Bangalore Blast 2021)
పేలుడు తీవ్రత ధాటికి మృతదేహాలు 3 మీటర్ల దూరం ఎగిరిపడ్డాయి. మృతదేహాలు ఆనవాళ్లు లేకుండా మారిపోయాయి. పేలుడు శబ్దం 2 కిలోమీటర్ల దూరం వినిపించిందని స్థానికులు తెలిపారు. భూకంపం సంభవించిందేమో అని ప్రజలు ఆందోళనకు గురయ్యారు. తొలుత ముగ్గురు చనిపోయారని అధికారులు చెప్పారు. తర్వాత అందిన సమాచారం మేరకు మరణించింది ఇద్దరేనని స్పష్టత ఇచ్చారు.
బాణాసంచా కాదు..
ప్రమాదానికి బాణసంచా పేలుడు కారణమని మొదట్లో వార్తలు రాగా, స్థానికులు మాత్రం పంక్చర్ దుకాణంలోని కంప్రెషర్‌లో పేలుడే కారణం అని వివరించారు. అయితే ఘటనా స్థలిని పరిశీలించిన ఫోరెన్సిక్ బృందాలు స్థానిక గోదాములో నిల్వ ఉంచిన గుర్తు తెలియని రసాయనమే పేలుడుకు (Bangalore Godown Blast) కారణమని వెల్లడించారు. గ్యాస్ సిలిండర్, బాణసంచా లేదా షాట్ సర్క్యూట్... పేలుడుకు కారణం కాదని స్పష్టం చేశారు. ఘటనా స్థలి వద్ద కంప్రెషర్ ఆనవాళ్లు లభించలేదని వెల్లడించారు. పేలుడుకు గల కారణాలపై మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
దెబ్బతిన్న పది వాహనాలు
పేలుడు ధాటికి తరగుపేటలోని ఘటనా స్థలంలో పదికి పైగా వాహనాలు దెబ్బతిన్నాయి. ఇళ్లలోని కిటికీల అద్దాలు ధ్వంసం అయ్యాయి. భారీ శబ్దంతో పేలుడు సంభవించగా, ప్రజలు ఇళ్లలో నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు. ఘటనా స్థలంలో భీతావహ స్థితి నెలకొంది.
పరిహారం
ఈ ఘటనలో చనిపోయినవారి కుటుంబాలకు పరిహారం ప్రకటించారు చామరాజపేట ఎమ్మెల్యే జమీర్ అహ్మద్. ఇద్దరి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి:వీధి కుక్కలకు విషం పెట్టి హత్య.. 12 శునకాలు మృతి