కరెంటు కోతల వల్ల ఐసీయూలో ఉన్న నలుగురు రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయవిదారక ఘటన కర్ణాటక బళ్లారిలోని విమ్స్ ఆస్పత్రిలో బుధవారం రాత్రి జరిగింది. ఈ ఘటనపై విచారణ కోసం ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని నియమించింది.
నలుగురు రోగుల మరణానికి ఆస్పత్రి యజమాన్యం, సిబ్బందే కారణమని రోగుల తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఘటనపై విమ్స్ ఆస్పత్రి అధికారులు మాత్రం మరోలా స్పందిస్తున్నారు. 'ఐసీయూలో ఉన్న మౌలా హుస్సేన్, చెట్టెమ్మ, చంద్రమ్మ, మనోజ్ కుమార్ అనే రోగులు పవర్ కట్ వల్ల మరణించలేదు. ఆరోగ్య పరిస్థితి విషమించడం వల్లే ప్రాణాలు కోల్పోయారు. అవన్నీ సహజ మరణాలే. కరెంట్ పోయినా జనరేటర్ ద్వారా ఐసీయూ వార్డుకు కరెంట్ అందించాం. రోగుల బంధువుల వ్యాఖ్యలు నిరాధారమైనవి ' అని విమ్స్ ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి.
'బళ్లారిలోని విమ్స్ ఆస్పత్రిలో రోగులు మరణించడం దురదృష్టకరం. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు డాక్టర్ స్మిత నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశాం. ' అని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ తెలిపారు. ఆస్పత్రిలో రోగుల మరణంపై ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య.. అసెంబ్లీలో మాట్లాడారు.