దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య తరహా ఘటన మరొకటి జరిగింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌లో.. భార్యను అతి కిరాతకంగా హత్య చేసి ముక్కముక్కలుగా నరికాడు ఓ భర్త. అనంతరం ఆమె శరీర భాగాలను వివిధ ప్రాంతాల్లో విసిరేశాడు. ఈ ఘటన ఫిబ్రవరి 24న సాఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరగగా ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
జహానాబాద్ గ్రామానికి చెందిన రామ్ సాగర్‌కు కొన్నేళ్ల క్రితం శాలుతో వివాహం జరిగింది. అయితే వీరిద్దరి మధ్య కొంతకాలం క్రితం విభేదాలు తలెత్తాయి. ఇటీవల అలానే గొడవ పడి.. భార్యను పదునైన ఆయుధంతో అతి కిరాతకంగా హత్యచేశాడు రామ్ సాగర్. అనంతరం ఆమె శరీర భాగాలను ముక్కముక్కలుగా నరికి ప్లాస్టిక్ సంచిలో పెట్టాడు. ఈ దారుణానికి ఒడిగట్టడంలో అతడి సోదరులు విద్యా సాగర్, శివ సాగర్ సైతం సహాయం చేశారు. అనంతరం వీరికి తెలిసిన ఆటో డ్రైవర్లు మోను, నీరజ్ తివారీని పిలిచారు. శరీర భాగాలను ఆటోలో తీసుకువెళ్లి వివిధ ప్రాంతాల్లో విసిరేశారు.
" సాఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిబ్రవరి 24న రోడ్డుపై ఓ మహిళ శరీర భాగాలు లభ్యమయ్యాయి. దీనిపై విచారణ చేపట్టగా.. ఆ శరీర భాగాలు జహానాబాద్‌కు చెందిన శాలు అనే మహిళవని గుర్తించాం. తర్వాత కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా.. ఆమె భర్త రామ్ సాగర్ నిందితుడని తేలింది."
--సల్మాన్ తాజ్ పాటిల్, డీసీపీ