Bulldozer on Temples Rajgarh:దేశంలో ప్రస్తుతం బుల్డోజర్ల ట్రెండ్ నడుస్తోంది. అక్రమ నిర్మాణాలపై పలు రాష్ట్రాల్లో భాజపా ఎక్కుపెడుతున్న అస్త్రం ఇదే. తొలుత ఉత్తర్‌ప్రదేశ్‌లో మొదలైన ఈ కూల్చివేతలు క్రమంగా పలు రాష్ట్రాలకు విస్తరించాయి. ఇటీవల మధ్యప్రదేశ్ సహా దిల్లీ జహంగీర్‌పురీలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు కూడా చేరింది.
ఇప్పుడు రాజస్థాన్ అల్వార్‌లో వందల ఏళ్ల నాటి 3 ఆలయాల్ని కూల్చివేయడం వివాదానికి దారితీసింది. సరాయి మొహల్లా ప్రాంతంలోని 300 సంవత్సరాల పురాతన శివాలయం సహా మరో రెండు ఆలయాలను బుల్డోజర్లతో కూల్చివేశారు అధికారులు. అక్కడే మరిన్ని దుకాణాలు, పలు నిర్మాణాలను కూడా ధ్వంసం చేశారు. ఈ కూల్చివేతలపై హిందూ సంఘాలు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి రాజ్‌గఢ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఆలయ కూల్చివేతలపై భాజపా మండిపడింది. నిజానిజాలను వెలికితీసేందుకు ఐదుగురు సభ్యులతో ఓ కమిటీని నియమిస్తున్నట్లు తెలిపారు రాజస్థాన్ భాజపా అధ్యక్షుడు డా. సతీశ్ పునియా. ఘటనా స్థలాన్ని పరిశీలించి, వాస్తవాలతో కూడిన నివేదిక తనకు అందించాలని ఆయన ఆదేశించారు. సిటీ అభివృద్ధి పనుల మాస్టర్ ప్లాన్‌లో భాగంగా కూల్చివేతలు చేపట్టినట్లు సమాచారం.