గత ఐదేళ్ల నుంచి కేరళ మనుగడను, వృద్ధిని అంతం చేయాలనుకున్నవారే నేడు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారని భాజపా, కాంగ్రెస్‌లను ఉద్దేశిస్తూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ధ్వజమెత్తారు. ఇది కేరళవాసులను ఎగతాళి చేయడమేనని అన్నారు. కేరళ ప్రతిష్ఠను దెబ్బతీయడానికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా భాజపా, కాంగ్రెస్‌లు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. తన సొంత జిల్లా కన్నూర్‌లో పోటీ చేస్తున్న వామపక్ష అభ్యర్థి తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
"మత విభజన చేయడానికి ఆర్ఎస్ఎస్ చేసే ఏ ప్రయత్నాలు కేరళలో ఫలించవు. లౌకికత్వ పునాదులు ఇక్కడ బలంగా ఉన్నాయి. సంఘ్ పరివార్ అజెండా ముందు కేరళవాసులు తలవంచనందుకే ఇక్కడ నీతులు చెబుతున్నారు. ఓటుతో వారిని శిక్షించండి. కాంగ్రెస్, భాజపాల భాయీ-భాయీ సంబంధం, ఎల్డీఎఫ్ చేసిన అభివృద్ధి గురించి ఇక్కడ అందరికీ తెలుసు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేరళను ప్రధాని మోదీ.. సోమాలియాతో పోల్చారు. ఈ రాష్ట్రాన్ని చీకటి కోణంలో చూపించడానికే సంఘ్ పరివార్ ఆసక్తి చూపుతుంది."
-పినరయి విజయన్, కేరళ ముఖ్యమంత్రి