తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'హవాయి చెప్పులు వేసుకునేవారూ విమానంలో వెళ్లాలి.. ఇప్పుడది సాధ్యమవుతోంది' - కర్ణాటకలో శివమొగ్గలో ఎయిర్​పోర్టు ప్రారంభోత్సవం

హవాయి చెప్పులు వేసుకుని తిరిగేవారు కూడా విమానంలో ప్రయాణించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రస్తుతం అది సాధ్యమైందని పేర్కొన్నారు. కర్ణాటకలోని శివమొగ్గ ఎయిర్​పోర్టును ప్రారంభించిన ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.

pm modi inaugurates shivamogga airport
శివమొగ్గ ఎయిర్​పోర్టును ప్రారంభించిన ప్రధాని మోదీ

By

Published : Feb 27, 2023, 5:33 PM IST

సాధారణ హవాయి చెప్పులు వేసుకునే వారు కూడా విమాన ప్రయాణాలు చేయాలని. దేశంలో ఇప్పుడది సాధ్యమవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కర్ణాటకలోని శివమొగ్గలో రూ.450 కోట్లతో తామర పువ్వు ఆకారంలో అభివృద్ధి చేసిన ఎయిర్​పోర్టును సోమవారం ప్రారంభించారు మోదీ. ప్రారంభోత్సవం జరిగిన తర్వాత జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ప్రధాని.. భారత విమానయాన మార్కెట్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. రాబోయే రోజుల్లో భారత్​కు వేల విమానాలు అవసరమవుతాయని, మేడ్ ఇన్ ఇండియా ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్​లు వచ్చే రోజులు ఎంతో దూరంలో లేవని పేర్కొన్నారు.

శివమొగ్గ ఎయిర్​పోర్టును ప్రారంభించిన ప్రధాని మోదీ

శివమొగ్గ జిల్లాకే చెందిన బీజేపీ అగ్రనేత, మాజీ సీఎం యడియూరప్ప 80వ పుట్టినరోజునే విమానాశ్రయ ప్రారంభోత్సవం జరగడం గమనార్హం. ఈ సందర్భంగా ఆయనకు వినూత్నంగా శుభాకాంక్షలు చెప్పారు మోదీ. సభకు హాజరైన ప్రజలు తమ మొబైల్ ఫ్లాష్​లైట్లను ఆన్​ చేసి శుభాకాంక్షలు చెప్పాలని మోదీ కోరారు. ప్రజా జీవితానికి యడియూరప్ప చేసిన సేవలను ప్రధాని గుర్తు చేస్తూ.. శాసనసభలో ఆయన చేసిన ప్రసంగం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమన్నారు.

శివమొగ్గ ఎయిర్​పోర్టు నమూనా

కర్ణాటకలో 'డబుల్ ఇంజిన్' ప్రభుత్వం కొనసాగాలని ప్రజలు సంకల్పించుకున్నారని మోదీ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 2014కు విమానయాన రంగంలో స్కామ్​లు ఎక్కువగా జరిగేవని.. గత ప్రభుత్వాలకు భిన్నంగా ఇప్పుడు ఈ రంగం అపూర్వంగా విస్తరిస్తోందని మోదీ పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం చిన్న నగరాల్లో కూడా విమానాశ్రయాల ఏర్పాటుకు ముందుకు వచ్చిందని తెలిపారు. 'స్వాతంత్ర్యం వచ్చిన తర్వాతి నుంచి 2014 నాటికి మన దేశం 74 విమానాశ్రయాలను కలిగి ఉంది. అయితే గత తొమ్మిదేళ్లలో అనేక చిన్న నగరాలను కలుపుతూ మరో 74 విమానాశ్రయాలు వచ్చాయి' అని మోదీ చెప్పారు.

ప్రధాని మోదీ

రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోదీ తరచుగా కర్ణాటకలో పర్యటిస్తున్నారు. ఈ ఏడాదే ఐదోసారి కర్ణాటకకు విచ్చేశారు. మొత్తం మీద రూ.3600 కోట్ల కంటే ఎక్కువ విలువైన ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. తాజాగా, విమానాశ్రయ ప్రారంభోత్సవంతో పాటు బెళగావి జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో ఆయనతో పాటు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై, మాజీ సీఎం యడియూరప్ప తదితరులు పాల్గొన్నారు.

ఎయిర్​పోర్టు పరిసరాలను పరిశీలిస్తున్న మోదీ

ABOUT THE AUTHOR

...view details