వెదురు చెట్లపైనే పాతికేళ్లుగా జీవనం.. భార్య లేదన్న బాధతో ఎవరైనా నివసించడానికి మంచి ఇంటిని నిర్మించుకుంటారు. ఆ ఇంటి నిర్మాణం కోసం తమకున్న స్థాయిలో ఖర్చు పెడుతుంటారు. కొందరు అప్పు చేసి మరీ పెద్ద పెద్ద ఇళ్లను కడుతుంటారు. అయితే బంగాల్లోని ఓ వ్యక్తి మాత్రం వెదురు చెట్లపై తన గృహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడే గత 25 ఏళ్లుగా జీవిస్తున్నాడు.
పూర్వ బర్దమాన్ జిల్లా.. కత్వా సమీపంలోని పాలిత్పుర్ గ్రామానికి చెందిన లోకు రాయ్ అనే వ్యక్తి ఇలా భిన్నమైన జీవితాన్ని గడుపుతున్నాడు. అతడి భార్య పాతికేళ్ల క్రితం అగ్నిప్రమాదంలో మరణించింది. అప్పటి నుంచి అతడు.. మానసిక స్థైర్యాన్ని కోల్పోయాడు. అనంతరం ఇంటి నుంచి బయటకు వచ్చేసి.. వెదురు చెట్లపైన ఎండుగడ్డితో ఇల్లు నిర్మించుకున్నాడు.
లోకు రాయ్.. తన నివాస ప్రాంతంలో ఒక చిన్న తోటను పెంచడం ప్రారంభించాడు. వివిధ రకాల పూల మొక్కలు, చెట్లు నాటాడు. తన నివాసస్థలం వైపు నీరు వచ్చేందుకు కాలువను తవ్వి చెరువుకు అనుసంధానం చేశాడు. వర్షాకాలంలో చెరువు నుంచి వచ్చిన చేపలను పడుతుంటాడు. రోజూ ఉదయం తోటను చూసేందుకు వెళ్తుంటాడు. వ్యవసాయ కూలీ పనులకు వెళ్లి డబ్బులను సంపాదిస్తుంటాడు.
చెట్లపై నివాసంలో లోకు రాయ్ మధ్యాహ్న భోజనానికి గ్రామంలో ఉన్న తన కుమార్తె ఇంటికి వెళ్తాడు. అక్కడే భోజనం చేసి.. కాసేపు అలా షికారుగా తిరిగి మళ్లీ సాయంత్రానికి పొలంలో ఉన్న తన ఇంటికి చేరుకుంటాడు. అనంతరం కొవ్వొత్తులతో దీపాలను వెలిగిస్తాడు. ఇలాగే జీవితాంతం వెదురు చెట్లపైన ఇంటిలోనే జీవించాలని లోకు రాయ్ కోరుకుంటున్నాడు. లోకు రాయ్ స్వస్థలం.. బిహార్ కాగా, అతని తల్లిదండ్రులు పాలిత్పుర్కు వలస వచ్చేశారు. అందుకే అప్పటి నుంచి వీరి కుటుంబం ఇక్కడే స్థిరపడిపోయింది.