కన్న వారే కాదన్నారు. సమాజం పట్టించుకోలేదు. అయినా వెనకడుగు వేయలేదు. సహించని వారే సలాం కొట్టేలా ఎదిగి.. తన లాంటి ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది హిజ్రా మహీ గుప్తా. ఉత్తర్‌ప్రదేశ్ నోయిడాలో హిజ్రాలకు అంకితం చేసిన ప్రైడ్ మెట్రో స్టేషన్‌కి టీమ్ లీడర్‌గా నిలిచింది మహీ. ఈ మెట్రోలో పనిచేసే వారంతా హిజ్రాలే. ఒకప్పుడు తనను ఊర్లోనుంచి వెళ్లగొట్టిన వారే ఇప్పుడు అభినందనలు తెలియజేస్తున్నారని మహీ గుప్తా తెలిపారు. ఈ విజయం వెనుక ఎన్నో ఏళ్ల కష్టం ఉందని మహీ వెల్లడించారు.
బిహార్ కటిహార్ జిల్లా సెమాపుర్ గ్రామానికి చెందిన మహీ గుప్తా.. ఓ హిజ్రా అని తెలియం వల్ల 2007లో ఇంటి నుంచి వెళ్లగొట్టారు. 2008 నుంచి పిల్లలకు ట్యూషన్స్ చెపుతూ.. వచ్చే డబ్బుతో చదవుకుంది. 2017లో మహీ కుటుంబసభ్యులు ఆమెను తిరిగి ఇంటికి ఆహ్వానించారు. 2019లో హిజ్రాలకు దిల్లీ ప్రభుత్వం ఉద్యోగావకాశాలు కల్పిస్తోందని తెలుసుకుని.. ఎంతో కష్టపడి చదివింది. అనేక అవాంతరాలను ఎదుర్కొని ఉద్యోగం సాధించి.. టీమ్ లీడర్ స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం తాను సాధించిన ఈ విజయంపట్ల గ్రామం నుంచి వెళ్లగొట్టిన వారే.. ఫోన్లు చేసి అభినందనలు తెలుపుతూ తనని కలవడానికి ప్రయత్నిస్తున్నట్లు మహీ తెలిపింది.