కొన్నేళ్ల క్రితం పత్రికలో వచ్చిన ప్రకటన.. ఓ ఆవిష్కరణకు కారణమైంది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలానికి చెందిన మాదాల సౌజన్య ఓ అంకుర సంస్థ స్థాపించేలా ప్రేరేపించింది. షేవింగ్ బ్రష్‌ల వల్ల ప్రాణాంతక హెపటైటిస్ ఎలా వ్యాప్తి చెందుతుందో తెలుసుకున్న ఆమె.. పరిష్కారం గురించి ఆలోచించారు. ఆ పరిశోధనలో నుంచి వచ్చిందే ఆర్గానిక్ షేవింగ్ బ్రష్.
హెచ్ఐవీ వ్యాప్తి బాగా పెరిగిన దశలో ఒకరు వాడిన బ్లేడ్‌లు మరోసారి వినియోగించరాదన్న అవగాహన ప్రజల్లో వచ్చింది. అయితే ఇప్పటికీ.. సెలూన్లలో షేవింగ్ కిట్‌లు సామూహికంగానే వాడుతున్న పరిస్థితి. బ్లేడు మాత్రం మార్చి ఒకే రేజర్ దీర్ఘకాలం వాడతారు. హెపటైటిస్ వైరస్ ఆ బ్రష్‌ల ద్వారా ఒకరి నుంచి ఒకరికి సోకే అవకాశం ఉంది. బ్రష్‌లు మార్చడం అంత తేలికైన పని కాదు. అందుకే ఎలాంటి ప్రమాదం లేకుండా ఒకసారి వాడి పడేసేలా తక్కువ వ్యయంతో షేవింగ్ బ్రష్ రూపొందించారు సౌజన్య.
"ఈ పరిశ్రమ ఎలా ప్రారంభించాలో మొదట్లో తెలియలేదు. పరిశోధనలో భాగంగా చాలావాటిని పరీక్షించా. చివరకు ఈ ఫైబర్ సరిగ్గా కుదిరింది. ప్రాసెసింగ్ తర్వాత ఫైబర్‌ను బ్రష్‌కు అనుకూలంగా తయారు చేసుకోగలిగాం."
-మాదాల సౌజన్య, ఆర్గానిక్ షేవింగ్ బ్రష్ రూపకర్త
ఏడాదిపాటు పరిశోధన చేసిన సౌజన్య.. రకరకాల మొక్కలు పరిశీలించి అరటినారతో దీనిని రూపొందించారు. గుంటూరులోని అనంతవరంలో తయారీకేంద్రం ఏర్పాటుచేశారు. బోధ పేరుతో 10 రూపాయలకే ఈ బ్రష్ మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఒక్కసారి వాడి పడేసే ఆర్గానిక్ బ్రష్‌తో పాటు ప్లాస్టిక్ రేజర్లను కిట్ రూపంలో కలిపి అందిస్తున్నారు. ఈ రేజర్‌కు బ్లేడ్ పెట్టి, సీల్ వేస్తారు. బ్లేడ్ మార్చి వాడుకునే వీలుండదు.
"అరటి రైతులకు కూడా అదనపు లాభం వస్తుంది. గెల కొట్టేసిన తర్వాత వాటిని చేల బయట పడేయడానికి కూడా రైతుకు కొంచెం ఖర్చవుతుంది. వాళ్లకొచ్చే లాభంలో దీనికోసమే కొంత మొత్తం కేటాయించాలి. ఈ విధంగా వాళ్లకు కొంచెం ఖర్చు తప్పుతుంది."
-మాదాల సౌజన్య, ఆర్గానిక్ షేవింగ్ బ్రష్ రూపకర్త