స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దేశ ఐక్యతను చాటి చెబుతూ దేశభక్తి గీతాన్ని రాశారు. 'దేశ్ త సోబర్ నిజర్' (ఈ దేశం మనందరిది) అంటూ సాగే ఈ పాటను బెంగాలీకి చెందిన ఇంద్రనీల్ సేన్, మోనోమోయ్ భట్టాచార్య, త్రిష పరుయ్, దేవజ్యోతి ఘోష్ ఆలపించారు. దీన్ని ఒక వీడియో రూపంలో అద్భుతంగా చిత్రీకరించారు. దీదీ తన ఫేస్‌బుక్ ఖాతాలో శనివారం రాత్రి ఈ వీడియోను పోస్టు చేశారు. తాజాగా సోషల్ మీడియాలో ఇది తెగ చక్కర్లు కొడుతోంది.
మరోవైపు.. స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన మహనీయులను మర్చిపోకూడదంటూ మమత ఓ ట్వీట్ చేశారు.
"మన స్వేచ్ఛను అణచివేయాలని చూస్తున్న దుష్ట శక్తులను తరిమికొడదాం. అందరం ఐకమత్యంతో కలిసి పోరాడదాం. మనకు స్వాతంత్య్రం తీసుకురావడానికి ఎందరో మహనీయులు వారి ప్రాణాలను త్యాగం చేశారు. వారిని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు"