కేరళలో వచ్చే నెలలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కొల్లాం కార్పొరేషన్ పరిధిలోని మథిలిల్ వార్డు నుంచి భాజపా తరఫున పోటీ చేస్తున్న మహిళే 'కరోనా థామస్.' సృజనాత్మకత కలిగిన ఆమె తండ్రి థామస్ ఫ్రాన్సిస్ తన కవల పిల్లలకు ప్రత్యేకంగా పేర్లు పెట్టాలని భావించారట. అలా కుమారుడికి 'కోరల్' అని, కుమార్తెకు 'కరోనా' అని నామకరణం చేశారు. ఇలాంటి పేరుతో ఓ మహమ్మారి ఎదురవుతుందని బహుశా అప్పుడు ఆయనకు తెలియకపోవచ్చు.
మొదట్లో తన పేరును చూసి తోటి స్నేహితులు ఒకింత ఆశ్చర్యపడ్డారట. అయితే ఈ ఏడాది కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా 'గో కరోనా', 'కిల్ కరోనా' నినాదాలు మార్మోగాయి. ఆ సమయంలో తన పేరుతో చాలా ఇబ్బంది పడాల్సి వచ్చిందని కరోనా థామస్ చెబుతున్నారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం వచ్చిన తర్వాత తొలినాళ్లలో ప్రచారానికి వెళ్తే అందరూ వింతగా చూసేవారట. అయితే ఇప్పుడు ఆ పేరే తనకు కలిసొస్తోందని అంటున్నారు కరోనా థామస్.
"నా పేరు కారణంగా ఎక్కడకు వెళ్లినా ప్రజలు త్వరగా గుర్తుపడుతున్నారు. నా వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇలాగే ఎన్నికల రోజున కూడా ప్రజలు నన్ను సులువుగా గుర్తుపెట్టుకుని ఓటేస్తారని ఆశిస్తున్నా"