Third Wave Covid India: జనవరి నెలాఖరులో కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరిగి దేశంలో జీవన కాల గరిష్ఠానికి చేరుకుంటుందని ఐఐటీ కాన్పుర్ ప్రొఫెసర్ మణీంద్ర అగర్వాల్ తెలిపారు. రెండోవేవ్‌లో కంటే ఎక్కువ కేసులు ఈ సారి నమోదు అవుతాయని అంచనా వేశారు. ఇదే క్రమంలో మార్చి నాటికి కేసుల సంఖ్య అంతే స్థాయిలో తగ్గుముఖం పడుతుందని పేర్కొన్నారు.
"ప్రాథమిక అంచనాల ప్రకారం నెలాఖరులో దేశీయంగా కేసుల సంఖ్య గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. రెండో వేవ్‌లో నిర్ధరణ అయిన వైరస్ కేసుల సంఖ్య కంటే ఈ సారి నమోదు అయ్యే కేసుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఏ స్థాయిలో అయితే కేసులు పెరుగుతాయో.. అదే స్థాయిలో తగ్గుముఖం పడుతాయి. మూడో వేవ్‌లో జనవరి చివరి నాటికి కేసుల సంఖ్య గరిష్ఠానికి చేరి.. మార్చి మూడో వారంలో మూడో వేవ్ ముగుస్తుందని మా అంచనా."
-మణీంద్ర అగర్వాల్, ఐఐటీ కాన్పుర్ ప్రొఫెసర్
ప్రస్తుతం దేశ రాజధాని దిల్లీలో రోజుకు 22 వేల కేసులు నమోదు అవుతున్నాయని.. జనవరి రెండో వారం నాటికి వీటి సంఖ్య అమాంతం పెరిగి 40 వేలకు చేరే అవకాశం ఉందని మణీంద్ర అగర్వాల్ తెలిపారు. అంతేగాకుండా ముంబయి, కోల్‌కతా వంటి నగరాల్లో కూడా ఈ నెల మధ్యలో కేసులు గరిష్ఠానికి చేరుకుంటాయని పేర్కొన్నారు. అయితే ఆయా నగరాల్లో మూడో వేవ్ ఈ నెలాఖరుతో ముగిసే అవకాశం ఉంటుందని చెప్పారు.
ఎన్నికల ర్యాలీలు, బహిరంగ సభల ద్వారా మాత్రమే వైరస్ వ్యాప్తి చెందదని మణీంద్ర అగర్వాల్ తెలిపారు. అలా అనుకుంటే అది భ్రమ మాత్రమే అని అన్నారు. వ్యాప్తికి ఇంకా చాలా కారణాలు ఉన్నాయని పేర్కొన్నారు.