Golden Temple Blast News : పంజాబ్‌లోని అమృతసర్‌లో వరుస పేలుళ్లు కలకలం రేపుతున్నాయి. ప్రఖ్యాత స్వర్ణ దేవాలయం సమీపంలోనే మూడో సారి భారీ పేలుడు సంభవించింది. భారీ పేలుడు శబ్దాలతో స్వర్ణ దేవాలయం ప్రాంతం దద్దరిల్లింది. శ్రీ గురు రామ్‌దాస్ నివాస్ సమీపంలో అర్ధరాత్రి 12 గంటల సమయంలో పేలుళ్లు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలిలో పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు దర్యాప్తు చేపట్టారు.
గోల్డెన్ టెంపుల్ వద్ద మరో పేలుడు ఈ ఘటనపై పోలీస్ కమిషనర్ నౌనిహాల్ సింగ్ స్పందించారు. "అర్ధరాత్రి 12.15-12.30 గంటల సమయంలో పెద్ద శబ్దం వినిపించింది. ఇది మరో పేలుడు ఘటన. భవనం సమీపంలో శిథిలాలను కనుగొన్నాం. ఘటనపై పూర్తి విచారణ జరుగుతోంది" అని ఆయన చెప్పారు. అయితే వరుస పేలుళ్ల ఘటనలతో ప్రజలు కాస్త భయపడుతున్నారు. అసలేం జరుగుతుందో తెలియక భయంభయంగా గడుపుతున్నారు. ఆరు రోజుల వ్యవధిలో మూడు ఘటనలు జరగడం గమనార్హం.
అమృత్‌సర్ పేలుళ్లకు పథకం వేసిన ఐదుగురు కుట్రదారులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించడమే పేలుడు వెనుక వారి ఉద్దేశమని వివరించారు. స్వర్ణ దేవాలయం సమీపంలో వరుస పేలుళ్లకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ అధ్యక్షుడు హర్జిందర్ సింగ్ ధామీ ఆరోపించారు. అమృత్ సర్ పేలుళ్ల అనుమానితులు! సోమవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో కూడా గోల్డెన్ టెంపుల్ సమీపంలోనే మరో పేలుడు సంభవించింది. దీంతో స్వర్ణ దేవాలయాన్ని సందర్శించేందకు వచ్చిన భక్తులు ఒక్కసారిగా ఉలికిపడ్డారు. కాస్త భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీస్ అధికారులు.. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. అయితే ఈ పేలుడు ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీస్ కమిషనన్ నౌనిహాల్ సింగ్ తెలిపారు. విషయం తెలుసుకున్న వెంటనే ఆయన ఘటనాస్థలికి చేరుకున్నారు. "పేలుడు ఘటనను ధ్రువీకరిస్తున్నాం. ప్రస్తుతం పరిస్థితి సాధారణంగా ఉంది. బాంబ్ స్క్వాడ్, ఫోరెనిక్స్ బృందాలు చేరుకున్నాయి. ఒక వ్యక్తి కాలికి చిన్న గాయమైంది" అని ఏడీసీపీ మెహతాబ్ సింగ్ వెల్లడించారు. ఘటనా సమయంలో అక్కడే డ్యూటీ చేస్తున్న ఓ స్వీపర్ కూడా మాట్లాడారు. "నేను ఇక్కడ స్వీపర్‌ను. డ్యూటీ చేస్తుండగా పెద్ద పేలుడు శబ్దం వినిపించింది. భారీగా పొగలు కమ్ముకున్నాయి" అని తెలిపారు.
శనివారం రాత్రి కూడా..
స్వర్ణ దేవాలయం సమీపంలోని దర్బార్ సాహిబ్ దగ్గర శనివారం రాత్రి అకస్మాత్తుగా జరిగిన ఓ పేలుడులో కొందరు బాలికలు సహా పలువురు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు పేలుడు జరిగిన ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో స్థానికులకు ఒక్కసారిగా పేలుడు శబ్దం వినిపించడం వల్ల భయాందోళనకు గురయ్యారు. కొన్ని రాళ్లు, గాజు ముక్కలు వచ్చి తమపై పడ్డాయని కొందరు యాత్రికులు తెలిపారు. ఈ పేలుడు కారణంగా పార్కింగ్ ఏరియాలో ఉన్న పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయని ఓ పోలీసు అధికారి తెలిపారు. అయితే స్వర్ణ దేవాలయంలో బాంబు పేలుడు అంటూ వస్తున్న వార్తలను పోలీసులు ఖండించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పంజాబ్ పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.