తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఇలా చేస్తే 2024లో యూపీఏ-3 ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం'.. ప్రతిపక్షాలకు కపిల్​ సిబల్​ సూచన - ప్రతిపక్ష పార్టీల ఐక్యతపై కపిల్ సిబల్ వాఖ్యలు

Third Front Alliance : 2024లో యూపీఏ-3 గవర్నమెంట్​ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు రాజ్యసభ సభ్యులు కపిల్ సిబల్​. ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడి ప్రణాళికతో ముందుకెళితే.. బీజేపీని ఓడించడం సాధ్యమేనన్నారు. వచ్చే పార్లమెంట్​ ఎన్నికల్లో.. ప్రతిపక్ష పార్టీలు అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన కీలక సూచనలు చేశారు.

opposition parties meeting
ప్రతిపక్ష పార్టీల ఐక్యతపై కపిల్ సిబల్ వ్యాఖ్యలు

By

Published : Jun 18, 2023, 5:52 PM IST

Third Front Alliance : 2024లో పార్లమెంట్​ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలన్నీ ఉమ్మడి వ్యూహంతో ముందుకెళితే.. యూపీఏ-3 గవర్నమెంట్​ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజ్యసభ సభ్యులు, మాజీ కాంగ్రెస్​ నేత కబిల్​ అభిప్రాయపడ్డారు. బీజేపీని ఎదుర్కొనేందుకు సీట్ల పంపకాలలో.. ప్రతిపక్షాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిని అవలంభించాలని ఆయన సూచించారు. ఇలా చేస్తే యూపీఏ ప్రభుత్వం మళ్లీ ఏర్పడటం సాధ్యమేనన్నారు. ప్రతిపక్ష పార్టీలన్నీ సాధారణ కార్యక్రమాలు పెట్టుకోకుండా.. దేశం కోసం ఓ కొత్త విజన్​తో ముందుకెళ్లాలని పేర్కొన్నారు.

జూన్​ 23న బిహార్​ రాజధాని పట్నాలో ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్ అధ్వర్యంలో.. ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి సమావేశం జరగనున్న నేపథ్యంలో కపిల్​ సిబల్ వాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వంటి అగ్రనేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు.. ప్రతిపక్ష కూటమిని ఏర్పాటు చేసే వ్యూహంపై వీరు సమాలోచనలు చేయనున్నారు.

బీజేపీని ఓడించడం సాధ్యమేనన్న కపిల్​ సిబల్​.. కర్ణాటకలో కాంగ్రెస్​ గెలుపే దానికి ఉదాహరణ అని పేర్కొన్నారు. కానీ 2024లో భారీ ప్రకటనలు చేయకుండా.. బీజేపీని ఎదుర్కొనేందుకు జాగ్రత్తగా ముందుకెళ్లాలని ఆయన హెచ్చరించారు. వచ్చే లోక్​సభ ఎన్నికలు పూర్తిగా భిన్న ధోరణిలో జరుగుతాయని కపిల్​ సిబల్​ వెల్లడించారు. వచ్చే పార్లమెంట్​ ఎన్నికల్లో జరిగే పోరాటం ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకం కాదన్నారు కపిల్​. పోరాటమంతా ఆయన కొనసాగించాలనుకుంటున్న సిద్ధాంతంపైన మాత్రమేనని వివరించారు. "ఒకే స్థానానికి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ రాజకీయ పార్టీల అభ్యర్థులు పోటీపడుతున్న రాష్ట్రాలు, నియోజకవర్గాలు ఉన్నాయి. టిక్కెట్ల పంపిణీ సమయంలో ఈ పార్టీలన్నీ ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవలంభించాలి. అప్పుడే యూపీఏ-3 ప్రభుత్వం ఏర్పాటు కావడం సాధ్యమవుతుంది." అని కపిల్​ సిబల్​ అభిప్రాయపడ్డారు.

చాలా రాష్ట్రాల్లో కొన్ని రాజకీయ పార్టీలు పూర్తి ఆధిపత్యం చెలాయిస్తున్నాయని పేర్కొన్నారు. రాజస్థాన్​, ఉత్తరాఖండ్​, హరియాణా, మధ్యప్రదేశ్​, ఛత్తీస్​గఢ్​ రాష్ట్రాల్లో బీజేపీకి ప్రధాని ప్రత్యర్థిగా కాంగ్రెస్ ఉందని.. దీంతో ఈ రాష్ట్రాల్లో సీట్ల పంపకాలలో ఎటువంటి సమస్య ఉండదని ఆయన తెలిపారు. మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెసేతర పార్టీలే.. బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నాయని పేర్కొన్నారు.

"బంగాల్​లో​ చూసుకుంటే.. అక్కడ బీజేపీకి టీఎమ్​సీ బలమైన ప్రత్యర్థి. కాబట్టి కాంగ్రెస్​కు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే కొన్ని నియోజకవర్గాల్లో ఇబ్బంది ఎదురుకావచ్చు. ఇక తమిళనాడు విషయానికే వస్తే.. డీఎమ్​కే ఇక్కడ బలమైన పార్టీగా ఉంది. డీఎమ్​కేతో కాంగ్రెస్​కు అలియెన్స్ ఉన్న కారణంగా ఇక్కడ కూడా సీట్ల పంపకాలలో ఎటువంటి సమస్య ఉండదు. ​తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో సమస్య ఉండవచ్చు. ఆంధ్రప్రదేశ్​లో వైఎస్​ఆర్​సీపీ, తెలుగుదేశం, కాంగ్రెస్​ల మధ్య త్రిముఖ పోటీ ఉన్నందున ఇక్కడ కూటమికి అవకాశాలు లేకపోవచ్చు"

-- కపిల్ సిబల్​, రాజ్యసభ సభ్యులు

ఇక గోవాలో బీజేపీకి కాంగ్రెస్​కు మధ్య ప్రత్యక్ష పోటీ ఉందన్న కపిల్​ సిబల్​.. ఉత్తర్​ప్రదేశ్​లో ప్రధాన ప్రతిపక్ష స్థానంలో సమాజ్​వాది పార్టీ ఉందన్నారు. కాబట్టి ఆర్​జేడీ, కాంగ్రెస్​ ఆ పార్టీకి జూనియర్​ భాగస్వాములుగా ఉంటే మంచిదని సూచించారు. యూపీలోని అన్నీ స్థానాల్లో పోటీచేస్తామని బీఎస్​పీ అధినేత మాయామతి ప్రకటించినందున.. ఆ పార్టీతో పొత్తుకు ఎలాంటి అవకాశాలు లేవన్నారు. బిహార్​లో కాంగ్రెస్​కు బలమైన ఉనికి లేకపోవడం వల్ల.. ఆ రాష్ట్రంలో ఎటువంటి సమస్య ఉండదని అన్నారు. తాను సూచిస్తున్న విధానం అమల్లోకి వస్తే.. ప్రతిపక్ష పార్టీల మధ్య సీట్ల పంపకాలలో ఎటువంటి సమస్య ఉండదని వివరించారు.

ప్రతిపక్ష కూటమికి నాయకత్వం వహించే వారిని ఎన్నికల తరువాతే నిర్ణయించాలా? లేదంటే ముందే ఉమ్మడి ప్రధాని అభ్యర్థిని నిలబెట్టాలా? అన్న విషయాన్ని పార్టీలు తొందరగా ఓ నిర్ణయానికి రావాలని ఆయన సూచించారు. కలిసి ముందుకెలా వెళ్లాలో పార్టీలకు బాగా తెలుసునని.. కూటమికి నాయకత్వం ఎవరు వహిస్తారనే దానిపై తాను ఇప్పుడే మాట్లాడని కపిల్​ సిబల్​ తెలిపారు. యూపీఏ మొదటి, రెండో ప్రభుత్వాలలో కేంద్ర మంత్రిగా పనిచేసిన కపిల్ సిబల్​.. 2022 మేలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం స్వతంత్ర్య అభ్యర్థిగా రాజ్యసభకు పోటీచేసి.. సమాజ్​వాది పార్టీ మద్దతుతో గెలుపొందారు.

కాగా ఈ మధ్యకాలంలో రాజకీయ అస్థిరతపై మోదీ చేసిన వ్యాఖ్యలపై కపిల్​ సిబల్ మండిపడ్డారు. రాజకీయ స్థిరత్వం దేశానికి ముఖ్యమన్న ప్రధాని మాటలను గుర్తు ​చేసిన కపిల్​.. మోదీ కాలంలో ఉన్న అస్థిరత యూపీఏ కాలంలో కనిపించలేదన్నారు. ఇప్పుడు మణిపుర్​ ఏం జరుగుతోందని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందన్నారు. బీజేపీ తన కుట్రలతో.. ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధానం దేశంలో ఆర్థిక, రాజకీయ, సామాజిక అస్థిరతకు బీజం వేసిందని కపిల్​ సిబల్ ఆరోపించారు. యుపీఏ మొదటి, రెండో ప్రభుత్వాలు.. నిజమైన రాజకీయ స్థిరత్వాన్ని అందించాయని ఆయన పేర్కొన్నారు. దాంతో పాటు ఆ కాలంలో నిజమైన వృద్ధి జరిగిందన్నారు.

ABOUT THE AUTHOR

...view details