మధ్యప్రదేశ్ బాలాఘాట్లోని జైన మందిరంలో చోరీకి పాల్పడ్డ ఓ దొంగ.. అనంతరం పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. దొంగతనం చేసిన వస్తువులను తిరిగిచ్చేయడమే కాకుండా.. క్షమాపణలు చెబుతూ లేఖ రాశాడు.
వివరాల్లోకి వెళ్తే...
బాలాఘాట్లోని శాంతినాథ్ దిగంబర జైన దేవాలయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి దొంగతనానికి పాల్పడ్డాడు. సోమవారం రాత్రి దేవాలయానికి వచ్చిన దొంగ.. 9 వెండి గొడుగులు, ఒక వెండి జాడీ, 3 ఇత్తడి పాత్రలు అపహరించాడు. చోరికి లగ్జరీ కారులో వచ్చిన దొంగ.. హనుమాన్ భక్తుడు. ముందుగా చెప్పులు విడిచి చేతులు జోడించి దేవున్ని వేడుకున్న.. దొంగ అనంతరం వస్తువులను ఎత్తుకెళ్లాడు.
గుడిలో చోరీ.. 'సారీ, తప్పు చేశా'.. అంటూ వస్తువులు తిరిగిచ్చిన దొంగ - లేఖ రాసి ఎత్తుకెళ్లిన వస్తువులను తిరిగిచ్చిన దొంగ
గుడిలో దొంగతనం చేసిన రూ.లక్షలు విలువ చేసే వస్తువులను తిరిగి ఇచ్చేశాడు ఓ దొంగ. మనసు మార్చుకొని లేఖ రాసిన దొంగ.. క్షమించమని ప్రార్థించాడు. ఈ దొంగతనం చేయడం వల్ల చాలా బాధపడ్డట్టు లేఖలో పేర్కొన్నాడు.
పోలీసులు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి దర్యాప్తును ప్రారంభించారు. ఆ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తూ, ఆధారాల కోసం ప్రయత్నించారు. గతంలో చోరీలకు పాల్పడిన వారినీ విచారించారు. ఇదే సమయంలో.. ఓ ఆసక్తికర ఘటన జరిగింది. దొంగ.. తన మనసు మార్చుకొని అపహరించిన వస్తువులను తిరిగి ఇచ్చేశాడు. చోరీ చేసిన వస్తువులను ఓ సంచిలో ఉంచి గ్రామ పంచాయతీ వద్ద వదిలేసి వెళ్లాడు.
నీళ్ల కోసం కుళాయి వద్దకు వెళ్లిన జైన్ కుటుంబసభ్యులు సంచిని గమనించారు. తెరిచి చూడగా అందులో అపహరణకు గురైన వస్తువులు ఉన్నాయి. అందులో ఒక లేఖ సైతం ఉంది. లేఖలో తాను తప్పు చేశానని, క్షమించమని రాశాడు. ఈ దొంగతనం మూలంగా తాను చాలా బాధలు పడ్డట్టు పేర్కొన్నాడు. జైన్ సొసైటీకి, పోలీసులకు దీనిపై సమాచారం అందించారు స్థానికులు.