తనను శిక్షించడానికే పార్లమెంటులో కేంద్రం ఓ బిల్లు ప్రవేశపెట్టిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఆ బిల్లు ఆమోదించడం ద్వారా ఎన్నికైన ప్రభుత్వానికి బదులుగా లెఫ్టినెంట్ గవర్నర్‌కు అధికారాలు అప్పజెప్పి.. తనను శిక్షిస్తోందని ఆరోపించారు. రైతుల నిరసనకు మద్దతు ఇచ్చినందుకు ఈ పరిణామాలు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. ఇందుకోసం తాము స్వాతంత్ర్య పోరాటం చేశామా? అని హరియాణా జింద్‌లో నిర్వహించిన కిసాన్ మాహాపంచాయత్లో కేజ్రీవాల్ ప్రశ్నించారు.
"దేశ రాజధానిలో శాంతి భద్రత సమస్యలున్నాయంటూ నాపై కేంద్రం ఒత్తిడి చేయడం ప్రారంభించింది. ఈ మేరకు నోటీసులు పంపింది. నా అధికారాలను లాక్కుంటామని బెదిరింపులకు పాల్పడుతోంది. అయితే వాటిని పట్టించుకోలేదు. ఆ నోటీసులను తిరస్కరించాను."