విస్తరణ కాంక్షతో రగలిపోతున్న పొరుగుదేశం చైనా.. భారత్‌కు ఓ తలపోటులా మారుతోంది. తన వక్రబుద్ధితో సరిహద్దుల్లో నిత్యం బలగాలను మోహరిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తాజాగా అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో చైనా బలగాలు వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ)ను దాటి భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు యత్నించాయి. అయితే, డ్రాగన్ చర్యను భారత సైన్యం సమర్థంగా నిలువరించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. గతవారం జరిగిన ఈ ఘటనతో ఇరు దేశాల బలగాల మధ్య కొంతసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది.
పెట్రిలింగ్ నిర్వహిస్తుండగా..
సరిహద్దుల్లో భారత బలగాలు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా.. దాదాపు 200 మంది పీపుల్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్‌ఏ) జవాన్లు వాస్తవాధీన రేఖకు అత్యంత సమీపంగా రావడాన్ని గుర్తించారు. వీరు ఎల్‌ఏసీని దాటేందుకు యత్నించగా భారత సైన్యం అడ్డుకుంది. ఈ క్రమంలో ఇరు దేశాల సైనికుల మధ్య కొన్ని గంటల పాటు ఘర్షణ తలెత్తింది. అయితే ఆ తర్వాత పరస్పర అంగీకారంతో ఇరు దేశాల బలగాలు వాస్తవాధీన రేఖ నుంచి వెనక్కి వెళ్లినట్లు సదరు వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలో భారత సైన్యానికి ఎలాంటి నష్టం వాటిల్లలేదని పేర్కొన్నాయి.