తెలంగాణ

telangana

By

Published : Apr 11, 2021, 7:37 AM IST

ETV Bharat / bharat

టీకాల కొరతపై ఎడతెగని 'మహా' వివాదం

కరోనా టీకాల సరఫరా విషయంలో కేంద్రానికి, మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. తమకు అవసరానికి సరిపడా వ్యాక్సిన్ సరఫరా కావడం లేదని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్​ తోపే ఆరోపించారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్​.. ఉన్న టీకాలను సరైన రీతిలో పంపిణీ చేయాలని వ్యాఖ్యానించారు. ​

rajesh tope and prakash javadekar
టీకాల కొరతపై ఎడతెగని 'మహా' వివాదం

కొవిడ్​-19 టీకాల సరఫరా విషయంలో కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎడతెగని రీతిలో వివాదం కొనసాగుతూనే ఉంది. అవసరాలకు సరిపడా వ్యాక్సిన్​ తమకు సరఫరా కావడం లేదని మహారాష్ట్ర చెబుతుండగా.. ఆ రాష్ట్రంలో తగినన్ని టీకా డోసులున్నాయని కేంద్రం చెబుతోంది. ఈ విషయమై మహారాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్​ తోపే, కేంద్ర మంత్రి ప్రకాశ్​ జావడేకర్​ల మధ్య శనివారం మళ్లీ వివాదం రాజుకుంది.

"టీకాల కొరతతో ఒక్క ముంబయిలోనే 70 వ్యాక్సిన్​ కేంద్రాలను మూసివేశాం. కేంద్రం ఇలాంటి సమస్యను తీవ్రంగా పరిగణించడం లేదు. రాష్ట్రాలకు కొవిడ్​ టీకాల కేటాయింపునకు ఒక ప్రాతిపదికను కేంద్ర ప్రభుత్వం రూపొందించాలి. కేంద్రం తాజాగా పంపిణీ చేసిన 3.5 కోట్ల డోసుల్లో మహారాష్ట్రకు 7 లక్షలే వచ్చాయి. మరింత ఒత్తిడి చేస్తే మరో 10 లక్షలు అదనంగా కేటాయించారు."

- రాజేశ్​ తోపే, మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి

12 కోట్లకుపైగా జనాభా ఉన్న మహారాష్ట్రలో 60 శాతం క్రియాశీల కేసులు ఉన్నట్లు గుర్తు చేశారు. రోజుకు 6 లక్షల టీకా డోసులు వేసే సామర్థ్యానికి పెంచినట్లు వివరించారు. "ప్రస్తుతం మా వద్ద 8 లక్షల డోసులే ఉన్నాయి. రోజుకు 4 లక్షలు వంతున అందుతాయని చెబతున్నారు. ఇలా రోజువారీగా సరఫరా చేస్తే మేము రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు టీకాలను ఎలా రవాణా చేయగలం?" అని తోపే ప్రశ్నించారు. కేంద్రం వివాదాలు సృష్టించకుండా రాష్ట్రానికి అవసరమైన టీకా డోసులను పంపించాలని శివసేన నేత సంజయ్​ రౌత్​ కోరారు.

'ఉన్న టీకాలను సరిగా వేయండి'

తోపే వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ స్పందించారు. మహారాష్ట్రకు 1.10కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను సరఫరా చేసినట్లు తెలిపారు. అదేవిధంగా గుజరాత్‌, రాజస్థాన్‌లూ కోటికిపైగా వ్యాక్సిన్‌ డోసులు అందుకున్నాయని వివరించారు. ప్రస్తుతం మహారాష్ట్రలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా 1,100 వెంటిలేటర్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌తో సమీక్ష సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు.

"శుక్రవారం సాయంత్రం 6గంటల వరకూ అందిన సమాచారం ప్రకారం కేవలం ఒక్క మహారాష్ట్రకే 1.10కోట్ల వ్యాక్సిన్‌ డోసులను అందించాం. మహారాష్ట్ర, గుజరాత్‌, రాజస్థాన్‌లు మాత్రమే కోటికి పైగా కరోనా డోసులు అందుకున్నాయి."

-ప్రకాశ్​ జావడేకర్​, కేంద్ర మంత్రి.

ఉన్న టీకాలనుసరైన రీతిలో పంపిణీ చేయాలని జావడేకర్​ సూచించారు. వ్యాక్సిన్‌ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రంపై అసత్య ఆరోపణలు చేస్తోందా? అన్న ప్రశ్నకు 'రాజకీయాలు చేయడానికి ఇది సమయం కాదు' అని జావడేకర్​ వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి:నిండుకుంటున్న టీకా నిల్వలు- పంపిణీకి బ్రేకులు!

ABOUT THE AUTHOR

...view details