Rahul gandhi london: లండన్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి భాజపా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. భారత్లో.. సమస్యలను ఎత్తిచూసే సంస్థలను క్రమంగా అణచివేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పార్లమెంట్, ఎన్నికల వ్యవస్థ సహా ప్రజాస్వామ్య వ్యవస్థను ఓ సంస్థ తన అధీనంలోకి తెచ్చుకుందని పేర్కొన్నారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం కార్పస్ క్రిస్టీ కాలేజ్లో ఏర్పాటు చేసిన 'ఇండియా ఎట్ 75' కార్యక్రమానికి హాజరైన ఆయన.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులతో ముచ్చటించారు.
"స్వేచ్ఛగా ప్రశ్నించేందుకు అవకాశం ఉన్నప్పుడే భారత్ సజీవంగా ఉన్నట్లు.. అదే మౌనంగా ఉంటే ఇంక అందులో అర్థం లేదు. పార్లమెంట్, ఎన్నికలు, ప్రజాస్వామ్యం మొదలైన వ్యవస్థలపై దాడులు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ విజన్లో కేవలం కొంతమంది మాత్రమే ఉంటారు. ఈ వైఖరిని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. హిందూ జాతీయవాదం అనే పదాన్ని కూడా అంగీకరించను. దాడులు, హత్యలకు పాల్పడే వారి సిద్ధాంతాలను హిందుత్వంతో పోల్చడం సరికాదు."