Kodi Katthi Case allegations are fabricated: కోడికత్తి కేసులో ఎలాంటి నేరపూరిత కుట్ర లేదని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) నిగ్గు తేల్చింది. నిందితుడు శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు కాదని, పథకం ప్రకారమే దాడి జరిగిందన్న జగన్ అభియోగాలు అవాస్తవమని స్పష్టం చేసింది. విశాఖ ఎయిర్‌పోర్టులో ఉన్న ఫ్యూజన్ ఫుడ్స్ యజమాని హర్షవర్ధన్‌కు.. తెలుగుదేశం పార్టీతోనూ, దాడితోనూ సంబంధం లేదని కుండబద్దలు కొట్టింది. సమగ్ర విచారణ తర్వాతే ఈ విధమైన నిర్ధారణకు వచ్చామన్న ఎన్‌ఐఏ.. తదుపరి దర్యాప్తు అవసరం లేదని, జగన్ పిటిషన్లు కొట్టేయాలని కోర్టును కోరింది. దీన్ని బట్టి... నాలుగున్నరేళ్లుగా జగన్ చేస్తున్న ప్రచారాలు, తెరపైకి తెచ్చిన కుట్ర సిద్ధాంతాలు పూర్తిగా అవాస్తవమని తేటతెల్లమైంది.
విశాఖ విమానాశ్రయంలో జగన్‌పై జరిగిన కోడి కత్తి దాడి కేసుపై ఇప్పటికే కోర్టులో విచారణ మొదలైనందున.. తదుపరి ఎలాంటి దర్యాప్తు అవసరం లేదని ఎన్‌ఐఏ స్పష్టం చేసింది. ఈ విషయంలో జగన్ దాఖలు చేసిన పిటిషన్లు కొట్టేయాలని కౌంటర్ అఫిడవిట్‌లో పేర్కొంది. అందులో అనేక అంశాలను విస్పష్టంగా ప్రస్తావించింది. జగన్ ఆరోపించినట్లు దాడి వెనుక ఎలాంటి నేరపూరిత కుట్ర లేదని ఎన్‌ఐఏ వెల్లడించింది. నిందితుడు శ్రీనివాసరావు తెలుగుదేశం సానుభూతిపరుడు కాదన్న ఎన్‌ఐఏ.. ఈ దాడిలో ఇతర వ్యక్తులు, రాజకీయ పార్టీల ప్రమేయం లేదని స్పష్టం చేసింది. 2019 జనవరి 12 నుంచి 18వ తేదీ మధ్య నిందితుడిని ప్రశ్నించగా.. జగన్‌పై దాడి ఘటనలో ఇతర వ్యక్తులు, రాజకీయ పార్టీల ప్రమేయం లేదని తేలిందని కౌంటర్‌లో పేర్కొంది.
నిందితుడి స్వగ్రామం ఠాణేలంకను సందర్శించామని, కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలు పరిశీలించామని.. జాతీయ దర్యాప్తు సంస్థ తెలిపింది. ముమ్మిడివరం పోలీస్ స్టేషన్‌లో 2017 మార్చి 2న నమోదైన కేసులో శ్రీనివాసరావు ఓ నిందితుడని.. 2017 జులై 30న అభియోగపత్రం కూడా దాఖలైందని కోర్టుకు నివేదించింది. జగన్‌పై దాడికి ముందు శ్రీనివాసరావు ఎక్కడెక్కడ పనిచేశాడు, ఏయే ప్రాంతాల్లో ఉన్నాడనే అంశాలపై సమగ్రంగా దర్యాప్తు చేసినట్లు వివరించింది. శ్రీనివాసరావు సంబంధీకులను ప్రశ్నించామని, గత చరిత్ర తెలుసుకున్నామని.. జగన్‌పై దాడి ఘటనకు సంబంధించి ఎక్కడా, ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదని కుండబద్దలు కొట్టింది.
తనను చంపేందుకు పన్నిన కుట్రలో విశాఖ ఎయిర్‌పోర్టులోని ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ యజమాని తొట్టెంపూడి హర్షవర్ధన్ ప్రసాద్ భాగస్వామి అంటూ జగన్ చేసిన అభియోగం అవాస్తవమని ఎన్‌ఐఏ తేల్చింది. దాడిలో హర్షవర్దన్ పాత్ర, ప్రమేయం లేవని నిర్ధారించింది. ఫ్యూజన్ ఫుడ్స్ యజమాని పేరు హర్షవర్ధన్ చౌదరి అనడం అవాస్తవమని.. ఆయన పూర్తిపేరు తొట్టెంపూడి హర్షవర్ధన్ ప్రసాద్ మాత్రమేనని స్పష్టం చేసింది. ఆయన తెలుగుదేశం నాయకుడని, 2014 ఎన్నికల్లో గాజువాక నుంచి ఆ పార్టీ టికెట్ ఆశించారన్న జగన్ ఆరోపణల్లో వాస్తవం లేదని తేల్చిచెప్పింది. కులాన్ని తెలియజేసేలా మోపిన అభియోగాలు, తెలుగుదేశం పార్టీతో పాటు ఒక కులానికి దాడి కుట్రను ఆపాదించేలా హర్షవర్ధన్ ప్రసాద్ పేరును హర్షవర్ధన్ చౌదరి అని పేర్కొంటూ ఎన్‌ఐఏకి జగన్ ఇచ్చిన వాంగ్మూలం పచ్చి అబద్ధమని తేటతెల్లమైంది.