తనను తాను వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించి వార్తల్లో నిలిచిన గుజరాత్లోని వడోదరకు చెందిన క్షమాబిందుకు ఆదిలోనే ఆటంకం ఎదురైంది. ఈనెల 11న జరగాల్సిన ఈ స్వీయ పరిణయం కీలక మలుపు తిరిగింది. గోత్రిలోని ఆలయంలో వివాహం చేసుకోవాలని నిర్ణయించగా.. గుడి పాలకమండలి అందుకు నిరాకరించింది. క్షమాబిందు నిర్ణయాన్ని తప్పుపట్టారు మాజీ డిప్యూటీ మేయర్ సునితా శుక్లా. ఆలయ యాజమాన్యంతో మాట్లాడామని, ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదని నిర్ణయించినట్లు చెప్పారు.
దేశంలోనే తొలి స్వీయ పరిణయంగా నిలిచిన ఈ వివాహం గురించి తెలుసుకున్న పలువురు సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. 'యువతి వివాహం గురించి విన్నాను. ఆమె వివాహం చేసుకోబోతున్న ఆలయం మా పరిధిలోనే ఉంది. తనను తాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు గుడిలో తెలియజేసింది ఆ యువతి. నాగరికత కలిగిన నగరంలో ఇలాంటి సామాజిక ఉపద్రవాన్ని అంగీకరించకూడదు. ఒక పెద్ద స్కీమ్తోనే ఈ పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆ యువతి సమాజంలో ఒకరిగా ఉండాలి. ఆమె తీసుకున్న నిర్ణయం యువతీయువకులను మోసం చేసినట్లే. ' అని పేర్కొన్నారు సునితా శుక్లా. ఈ విషయం తెలుసుకున్న క్షమాబిందు.. ఆలయంలో పెళ్లి చేసుకోబోనని తేల్చి చెప్పింది. అయితే ఆమె స్వతంత్రురాలు కాబట్టి.. ఆలయం బయట ఏదైనా చేయొచ్చని.. కానీ, గుడిలో కాదని పేర్కొన్నారు సునిత.