గొప్ప పనులు చేయలేకపోయినా పర్లేదు కానీ చిన్న పనులను ప్రేమతో చేయాలన్న మదర్ థెరిసా మాటలను ఆదర్శంగా తీసుకున్న తమిళనాడు జంట ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది. 'అన్బు జ్యోతి' అనే ఆశ్రమాన్ని స్థాపించిన ఈ జంట.. 17 ఏళ్ల నుంచి దాదాపు 300 మందికి పైగా నిస్సహాయ అనాథ మృతదేహాలకు దహన సంస్కరాలు నిర్వహించింది.
విల్లుపురంలోని గుండాలపులియూర్ గ్రామానికి చెందిన జువిన్, మారియా దంపతులు.. 2004 నుంచి ఈ పనిని చేస్తున్నట్లు తెలిపారు. వారు స్థాపించిన ఆశ్రమంలో నిరాశ్రయులకు చోటు కల్పించి వారి బాగోగులు చూసుకోవడమే కాకుండా, ఎవరైనా మృతి చెందితే వారి అంతిమసంస్కరాలు సైతం దగ్గరుండి నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అయినవారెవరూ లేని వీరికి అన్నీ తామై సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా తమిళనాడు, పుదుచ్చేరి లాంటి రాష్ట్రాల్లో నిస్సహాయంగా తిరుగుతున్న మానసిక వికలాంగులను గుర్తించి వారికి సరైన వైద్య సదుపాయాలు అందిస్తున్నారు.