కేరళలో కాంగ్రెస్‌కు సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్న క్రైస్తవులపై ఈ దఫా వామపక్షాలు, భాజపా కన్నేశాయి! ఆ వర్గంలోని అంతర్గత విభేదాలను సొమ్ము చేసుకునేందుకు పోటాపోటీగా వ్యూహరచన చేస్తున్నాయి. కీలక నేతలకు గాలం వేస్తున్నాయి. కేరళ కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి విజయన్ థామస్ తాజాగా కమలదళంలో చేరడం, జోస్ మణి సారథ్యంలోని కేరళ కాంగ్రెస్ (ఎం) చీలిక వర్గంతో వామపక్ష కూటమి చేతులు కలపడం వంటి పరిణామాలన్నీ క్రైస్తవులను తమవైపు తిప్పుకొనేందుకు ఆయా పార్టీలు తహతహలాడుతున్న తీరుకు నిదర్శనాలు.
35 స్థానాల్లో ప్రభావం!
కేరళ జనాభాలో క్రైస్తవులు 19 శాతం వరకు ఉంటారు. సుమారు 35 సీట్లను వీరు ప్రభావితం చేయగలరన్నది విశ్లేషకుల అంచనా! ముఖ్యంగా ఎర్నాకుళం, కొట్టాయం, ఇడుక్కి, పథనంతిట్ట జిల్లాల్లో క్రైస్తవుల ప్రభావం ఎక్కువ. సంప్రదాయబద్ధంగా చూస్తే వీరంతా ఎక్కువగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుంటారు. కానీ ఈసారి వీరికి గాలం వేయటంలో వామపక్షాలు, భాజపా పోటీ పడుతున్నాయి.
చర్చిల మధ్య..
చర్చిల నిర్వహణపై క్రైస్తవ వర్గాల మధ్య సాగుతున్న వైరం ఈసారి ఎన్నికలపై పడేలా ఉంది. 2017లో సుప్రీం కోర్టు తీర్పు తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో క్రైస్తవులు ఎలా ఓటు వేస్తారనేది ఆసక్తికరంగా మారింది. 2017లో కేరళలోని చర్చిల నిర్వహణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఫలితంగా జాకోబ్‌ల చేతుల్లోని అనేక చర్చిలు వారి ప్రత్యర్థి వర్గమైన సంప్రదాయుల నియంత్రణలోకి వెళ్ళాయి. దీంతో... జాకోబ్ చర్చి వర్గీయుల్లో ఆందోళన నెలకొంది. వీరు కనీసం 10-12 నియోజకవర్గాల్లో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అధికార సీపీఎం సారథ్యంలోని ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు తమ ప్రయోజనాలను కాపాడేలా లేవన్నది ఈ వర్గం భావన.
భాజపాతోనూ చర్చలు
సుదీర్ఘకాలంగా సాగుతున్న తమ విభేదాల పరిష్కారానికి జాకోబ్‌ల వర్గం ఆరెస్సెస్-భాజపా అగ్రనేతలతో కూడా సమావేశమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోనూ చర్చించింది. తమ ప్రయోజనాలు కాపాడి, హక్కులకు అండగా నిలిస్తే వచ్చే ఎన్నికల్లో భాజపాకు ఓటు వేస్తామనీ ఈ వర్గం వారు ప్రకటించారు. కొద్దిరోజుల కిందట కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు పీసీ చాకో ఈ వర్గం నేతే! మరోవైపు సంప్రదాయ వర్గం చర్చి వివాదాల పరిష్కారానికి ఎలాంటి కొత్త చట్టం తెచ్చినా ఊరుకోబోమంటోంది. గమ్మత్తేంటంటే చెంగన్నూరు నియోజకవర్గంలో ఈ వర్గమే భాజపాకు మద్దతు ప్రకటించడం. 2016 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో భాజపాకు 16 శాతం ఓట్లు వచ్చాయి.
మొత్తానికి అంతర్గత విభేదాలతో సాగుతున్న క్రైస్తవుల ఓట్లను కొల్లగొట్టడానికి అటు వామపక్ష కూటమితో పాటు ఇటు భాజపా కూడా తీవ్రంగానే ప్రయత్నిస్తోంది. ముస్లిం పార్టీ ఐయూఎంఎల్‌ను, ముస్లిం తీవ్రవాదాన్ని బూచిగా చూపించి క్రైస్తవ, హిందూ ఓట్లను ఆకర్షించటం భాజపా ఎత్తుగడగా ఉంది. దీంతోపాటు లవ్ జిహాద్ అంశమూ తమకు దోహదం చేస్తుందనేది కమలనాథుల ఆశ! యూడీఎఫ్‌కు లేదంటే ఎల్‌డీఎఫ్‌కు మద్దతిచ్చే సంప్రదాయం నుంచి కేరళ క్రైస్తవ ఓటర్లు ఎంతమేరకు పక్కకు జరుగుతారనేది ఆసక్తికరం!
జోస్ మణి వర్సెస్ పీజే జోసెఫ్
రాష్ట్రంలో అతిపెద్ద క్రిస్టియన్ పార్టీ.. కేరళ కాంగ్రెస్ (ఎం)! 40 సంవత్సరాలుగా ఈ పార్టీ కాంగ్రెస్ సారథ్యంలోని కూటమికి (యూడీఎఫ్) మద్దతిస్తూ వస్తోంది. అలాంటి పార్టీ ఈసారి చీలిపోయింది. పార్టీ గత ఛైర్మన్ కె.ఎం.మణి కుమారుడు జోస్ మణి సారథ్యంలో ఓ వర్గం, పీజే జోసెఫ్ నాయకత్వంలో మరో వర్గం అవతరించాయి. జోస్ మణి.. 40 ఏళ్ల మార్గాన్ని వీడి, ఈసారి తమ మద్దతును వామపక్షాల కూటమి (ఎల్‌డీఎఫ్)కి ప్రకటించారు. ఎల్‌డీఎఫ్ కూడా క్రైస్తవుల ఓట్ల ప్రాధాన్యాన్ని గుర్తించి... ఈ వర్గానికి 13 సీట్లు కేటాయించడం గమనార్హం. అంతేగాకుండా తమ పార్టీలోని అంతర్గత అసమ్మతిని కూడా తోసిరాజంటూ... 25 ఏళ్లుగా తమ కంచుకోటలైన రణ్ణి, పథనంతిట్టలాంటి నియోజకవర్గాలను కూడా కేసీ (ఎం)కు వదులుకుంది ఎల్‌డీఎఫ్. పీజే జోసెఫ్ సారథ్యంలోని వర్గం మాత్రం యూడీఎఫ్‌కే మద్దతు పలుకుతోంది.
ఇవీ చదవండి: