Bail cancellation of accused A1 Erra Gangireddy : వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏ1 నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేస్తూనే తిరిగి జులై 1న విడుదల చేయాలని తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. జులై 1న గంగిరెడ్డికి సాధారణ బెయిల్ మంజూరు చేయాలంటూ... హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించిన జస్టిస్ జెకే మహేశ్వరి, జస్టిస్ పిఎస్ నర్సింహలతో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్... తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. ఇదే సందర్భంలో... తన బెయిల్ రద్దు చేస్తూ... హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఎర్ర గంగిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ధర్మాసనం వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై అత్యవసరం లేదని పేర్కొన్న ధర్మాసనం... కోర్టు సెలవుల అనంతరం విచారించనున్నట్లు స్పష్టం చేస్తూ... జులై 14కి వాయిదా వేసింది.
ఇవేం ఉత్తర్వులు అంటూ... గంగిరెడ్డి లాంటి వ్యక్తులు బయట ప్రపంచంలో తిరగడం అత్యంత ప్రమాదకరమని, హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఏమాత్రం న్యాయ సూత్రాలకు అనుగుణంగా లేవని సునీత రెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఒక నిందితుడికి బెయిల్ రద్దు చేస్తూ... మళ్లీ ఎప్పుడు విడుదల చేయాలో కూడా తేదీ ఖరారు చేస్తూ... హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడంపై కేసు విచారణ త్వరితగతిన చేపట్టాలని మెన్షన్ చేసిన సందర్భంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ఆశ్చర్యం, అసహనం వ్యక్తం చేశారు. హైకోర్టు ఉత్తర్వులు చూసి... విచారణ సందర్భంగా తల పట్టుకున్నారు... ఇవి ఏరకమైన ఉత్తర్వులో అర్థం కాని పరిస్థితి అని వ్యాఖ్యానిస్తూ... పిటిషన్‌పై విచారణను వెకేషన్ బెంచ్‌కి బదిలీ చేశారు. ఈ ఉత్తర్వులు ఎనిమిదో వింత అని పిటిషన్‌పై విచారణ సందర్భంగా... సీబీఐ తరపు సీనియర్ న్యాయవాది అదనపు సొలిసిటర్ జనరల్ సంజయ్ జైన్ మంగళవారం విచారణ జరిగినప్పుడు ధర్మాసనం ముందు వ్యాఖ్యానించారు.