బాధితులే ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తే మంచిదిగానీ, క్షణం తీరిక లేని స్వచ్ఛంద సంస్థలు దాఖలు చేయడం ఏమి బాగుంటుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి వాటిని స్వీకరించబోమంటూ తిరస్కరించింది. ఉత్తర్‌ప్రదేశ్ ఉన్నత న్యాయస్థానాల సేవా నిబంధనలను సవాలు చేస్తూ సంవిధాన్ బచావో ట్రస్టు అనే స్వచ్ఛంద సంస్థ ఈ దావాను వేసింది.
'బాధితులనే దావా వేయనివ్వండి.. స్వచ్ఛంద సంస్థకు ఏం పని?' - సంవిధాన్ బచావో ట్రస్టు
బాధితులు ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తేనే స్వీకరిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. క్షణం తీరిక లేని స్వచ్ఛంద సంస్థలు దాఖలు చేయడం ఏమి బాగుంటుందని వ్యాఖ్యానించింది.
రిజర్వేషన్లు పాటించకుండా అన్ని వర్గాలకూ ఒకే తరహా కనీస ప్రమాణాలు నిర్ణయించడంపై స్వచ్ఛంద సంస్థ అభ్యంతరం తెలిపింది. జనరల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలు అందరికీ ఒకే తరహా కనీస అర్హతలు విధించారని, దీనివల్ల రిజర్వేషన్లకు అర్థం లేకుండా పోయిందని పేర్కొంది. దీన్ని పరిశీలించిన న్యాయమూర్తులు జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం..."దీనిని స్వీకరించడం లేదు. సంవిధాన్ బచావో ట్రస్టు ఏమిటి? ఓ స్వచ్ఛంద సంస్థ. క్షణం తీరికలేని అలాంటి సంస్థలు ఉన్నత న్యాయస్థానాల సేవా నిబంధనలను సవాలు చేయడాన్ని అంగీకరించం. ఈ నిబంధనల వల్ల నష్టపోయిన వారు ఎవరైనా ఆశ్రయిస్తే వారి వాదన వింటాం. దీనిపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం అవసరం లేదు" అని పేర్కొంది. ఇది అందరికి సంబంధించిన విషయం అంటూ ఆ సంస్థ తరఫున సీనియర్ న్యాయవాది అశోక్ కుమార్ శర్మ చేసిన వాదనతో ఏకీభవించలేదు. "మీరు కాదు. నష్టపోయిన వారెవరో దావా వేయనివ్వండి" అని వ్యాఖ్యానించింది.
ఇదీ చదవండి:తెలంగాణ హైకోర్టుకు జడ్జి నియామకంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు