నీ పేరేంటి: ఆజాద్
తండ్రి పేరు: స్వాతంత్య్రం
అడ్రస్: జైలు...
Azadi ka Amrit Mahotsav:15 ఏళ్ల కుర్రాడు.. ధైర్యంగా ఈ సమాధానాలు చెబుతుంటే న్యాయమూర్తికి ఎక్కడలేని కోపం వచ్చింది. 23 వారాల జైలు.. రోజూ 15 కొరడా దెబ్బలు శిక్షగా విధించాడు. ఆ క్షణమే మళ్లీ జీవితంలో ఆంగ్లేయులకు దొరక బోనని ప్రతినబూనిన ఆ కుర్రవాడు చంద్రశేఖర్ ఆజాద్‌గా పేరొందాడు. అలిరాజ్‌పుర్ సంస్థానం (ప్రస్తుత మధ్యప్రదేశ్‌లోనిది)లో 1906 జులై 23న జన్మించిన చంద్రశేఖర్ ఆజాద్ ఆదివాసీ భిల్లులతో కలసి పెరిగాడు. మంచి విలుకాడు. తల్లి కోరిక మేరకు ఉన్నత చదువు కోసం వారణాసి సంస్కృత పాఠశాలలో చేరాడు. అక్కడ ఉండగానే జలియన్‌వాలాబాగ్ ఊచకోత చోటు చేసుకుంది. ఆగ్రహంతో కదిలిపోయిన ఆజాద్ జాతీయోద్యమంలో దూకాడు. సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అరెస్టయినప్పుడే.. న్యాయమూర్తికి ధైర్యంగా సమాధానాలిచ్చి జైలుపాలయ్యాడు. అప్పుడే మళ్లీ జైలుకు రానని.. స్వేచ్ఛగా మరణిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఇంతలో.. చౌరీచౌరా సంఘటనానంతరం గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపేయటంతో ఆజాద్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఎలాగైనా భారత్‌కు బ్రిటిష్ వారి నుంచి విముక్తి కలిగించాలని విప్లవమార్గం వైపు మళ్లాడు.
The Story Of Chandrashekhar Azad: రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్రఫుల్లాఖాన్‌ల ప్రభావంతో హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ (హెచ్‌ఆర్‌ఏ)లో చేరాడు. కకోరి రైలు దోపిడీ తర్వాత బిస్మిల్ తదితరులను ఆంగ్లేయ ప్రభుత్వం అరెస్టు చేసి ఉరితీసింది. ఈ కేసులో పట్టుబడకుండా తప్పించుకున్న ఆజాద్.. ఝాన్సీ సమీపంలో పండిట్ హరిశంకర్ బ్రహ్మచారి పేరుతో సన్యాసి అవతారమెత్తి స్థానిక గ్రామస్థులతో సత్సంబంధాలు ఏర్పరచుకున్నాడు. ఈ సమయంలోనే భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ తదితరులతో కలసి హెచ్‌ఆర్‌ఏను హిందుస్థాన్ సోషలిస్టు రిపబ్లిక్ అసోసియేషన్ (హెచ్‌ఎస్‌ఆర్‌ఏ)గా పునర్‌వ్యవస్థీకరించాడు. ఝాన్సీ సమీపంలోని అడవుల్లో సహచరులకు తుపాకీ కాల్చటంలో శిక్షణ ఇచ్చాడు. మూడేళ్లపాటు ఈ బృందం ఆంగ్లేయులకు చుక్కలు చూపించింది. 1926లో ఏకంగా వైస్రాయ్ ప్రయాణిస్తున్న రైలునే పేల్చేయటానికి ప్రయత్నించింది. లాహోర్‌లో భగత్‌సింగ్‌తో కలసి డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్‌ను కాల్చిచంపింది. ఆ ఘటనలో కూడా ఆజాద్ తుపాకీకి పనిచెప్పాడు.