డ్రైవర్ ప్రవర్తనతో భయపడ్డ ఓ యువతి వేగంగా వెళుతున్న ఆటో నుంచి కిందకు దూకిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఈనెల 13న మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో జరిగింది. ఈ ప్రమాదంలో యువతి తలకు తీవ్రగాయాలైనట్లు పోలీసులు తెలిపారు. నీట్ కోచింగ్ తరగతి నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో ఆటో ఎక్కిన యువతిని సయ్యద్ అక్బర్ అనే డ్రైవర్ వేధింపులకు గురిచేశాడు. ఆందోళన చెందిన యువతి ఆటోను ఆపాలని వేడుకుంది. ఆమె మాటలు పట్టించుకోని డ్రైవర్ మరింత వేగంగా ఆటోను నడిపాడు. దీంతో భయపడిన ఆ యువతి.. ఆటో నుంచి కిందకు దూకింది. గాయపడ్డ ఆమెను స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు సయ్యద్ అక్బర్‌ను అరెస్టు చేశారు. అతడికి ముగ్గురు కుమార్తెలు కూడా ఉన్నట్లు తెలిపారు.
ర్యాపిడో రైడర్ లైంగిక వేధింపులు అవాస్తవం
ర్యాపిడో రైడర్ తనను లైంగికంగా వేధించాడంటూ ఓ మోడల్ చేసిన ఫిర్యాదు అవాస్తమని తేల్చారు బెంగళూరు పోలీసులు. తమ ప్రాథమిక దర్యాప్తులో ఎలాంటి వేధింపులు జరగలేదని తేలిందన్నారు. రైడ్ బుక్ చేసిన కాసేపటికే రద్దు అయ్యిందని చెప్పారు. బెంగళూరుకు చెందిన 21 ఏళ్ల ఓ మోడల్.. మంజునాథ్ తిప్పేస్వామి అనే ర్యాపిడో రైడర్ తనను లైంగికంగా వేధించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను తాకుతూ లైంగికంగా వేధించాడని ఫిర్యాదులో పేర్కొంది. బుధవారం రాత్రి 10:30 గంటల సమయంలో ర్యాపిడోను బుక్ చేయగా మంజునాథ్ వచ్చాడని.. ఓటీపీ సైతం తీసుకోలేదని చెప్పింది. అయితే.. ఇదంతా అవాస్తమని పోలీసులు స్పష్టం చేశారు.