తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కమలా హ్యారిస్​ విజయంతో పులకించిన తులసేంద్రపురం - kamala harris parents origin

అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి భారతీయ-అమెరికన్, తొలి ఆసియన్ మహిళ కమలా హ్యారిస్​. సెనేట్‌లోని ముగ్గురు ఆసియన్ అమెరికన్లలో 56 ఏళ్ల కమల ఒకరు. కమలా హ్యారిస్​ విజయంతో తమిళనాడులోని ఆమె స్వస్థలం పైంగనాడు తులసేంద్రపురం గ్రామ ప్రజలు సంబరాల్లో మునిగి తేలారు. ఎప్పటికైనా కమల తన పూర్వీకుల స్వస్థలానికి వస్తుందని ఆశిస్తున్నారు.

the people of thulasendrapuram of kamala harris mother proper place in india celebrates victory of kamala
కమలా హ్యారిస్​ విజయంతో పులకించిన తులసేంద్రపురం

By

Published : Jan 11, 2021, 7:12 AM IST

కమలా హ్యారిస్​ విజయంతో పులకించిన తులసేంద్రపురం

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ విజయం సాధిస్తే...తామే గెలిచినట్లు సంబరాలు చేసుకున్నారు తమిళనాడులోని ఓ గ్రామప్రజలు. సొంత రాష్ట్రంలోనే పెద్దగా ప్రాచుర్యం పొందని ఆ ఊరు.. కమలా హ్యారిస్ అమెరికా ఎన్నికల బరిలోకి నిలిచినప్పటి నుంచి సంబరాల్లో మునిగి తేలింది. శ్వేతసౌధానికి 14 వేల కిలోమీటర్ల దూరంలోని ఈ కుగ్రామం..కమలా హ్యారిస్ అమ్మమ్మ తాత రాజం, పీవీ గోపాల్ స్వస్థలం. ఊరిపేరు పైంగనాడు తులసేంద్రపురం. ఇక్కడికి చేరుకోవాలంటే తంజావూరు నుంచి మన్నార్‌గుడి వైపు 45 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఈ ఊర్లో ప్రస్తుతం 70 కుటుంబాలు నివసిస్తున్నాయి. 1911లో జన్మించిన గోపాలన్‌.. 2 పదుల వయసులో స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనేందుకు ఊరువిడిచివెళ్లారు. తర్వాత ఉన్నతస్థాయి అధికారిగా ఎదిగారు.

"కమల గెలుపు మాకు ఎన్నడూలేని సంతోషం తెచ్చిపెట్టింది. మా ఇంటి బిడ్డ ఆమె. ఆరోజున మా ముంగిళ్లను ముగ్గులతో అలంకరించాం. మిఠాయిలు పంచుకున్నాం. టపాసులు పేల్చాం. కమలా హ్యారిస్‌కు ఇష్టమైన ఇడ్లీ, సాంబారుతో ధర్మశాస్తా ఆలయంలో ప్రత్యేక వేడుక నిర్వహించాం."

-----అరున్‌మొళి, పైంగనాడు-తులసేంద్రపురం వాసి

కమల తల్లి శ్యామల 1950ల్లో అమెరికాలో చదువుకునేందుకు స్కాలర్‌షిప్ సంపాదించారు. ఆ అవకాశం సద్వినియోగం చేసుకోవాలంటూ ఆమె తండ్రి గోపాలన్ వెన్నుతట్టి ప్రోత్సహించారు. అమెరికాలో భవిష్యత్‌ను తీర్చిదిద్దుకునే సమయంలోనే శ్యామలా గోపాల్.. జమైకా దేశస్థుడు డొనాల్డ్ హ్యారిస్‌ను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు. కమల సోదరి మాయా హ్యారిస్ న్యాయవాది. ఊర్లోని శ్రీధర్మశాస్తా అయ్యనార్ ఆలయానికి కమల కుటుంబం నుంచి నిధులు అందిస్తున్నట్లు ఆలయ ట్రస్టీ సభ్యులు చెప్తున్నారు. కమల బంధువులు బాలచంద్రన్, సరళా గోపాలన్‌ ఇంటికి ప్రసాదం తప్పకుండా పంపిస్తారు. అమెరికాలో ఎన్నికల సమయంలో పైంగనాడు తులసేంద్రపురం గ్రామస్థులంతా.. కమలా హ్యారిస్ గెలవాలని పూజలు నిర్వహించారు. ఓట్ల లెక్కింపు సమయంలోనూ అందరూ ప్రార్థనల్లో పాల్గొన్నారు.

"ఆమె గెలుపుతో గతేడాది దీపావళి కాస్త ముందుగానే వచ్చేసింది. ఆ పండుగ లాగే సంబురాలు చేసుకున్నాం. కమల ఏదో ఒకరోజు తన పూర్వీకుల స్వస్థలానికి వస్తుందని ఆశిస్తున్నాం."

--ముత్తులక్ష్మి, పైంగనాడు-తులసేంద్రపురం వాసి

కమల తన ఆశయం నెరవేర్చుకుని, అనుకున్నది సాధించిందని చెప్తున్నారు ఆమె బంధువులు.

"చండీగఢ్‌లో వైద్యురాలిగా పనిచేసేదాన్ని. అక్కడికే కాదు...ఇతర ప్రాంతాలకూ కమల చాలా సార్లు వచ్చి, మమ్మల్ని కలిసింది. చిన్నప్పటినుంచీ బుద్ధిగా ఉండేది. ఏ పని చేసినా శ్రద్ధతో, సక్రమంగా చేసేది. ఏం చేయాలని కోరుకుందో అది సాధించి చూపించింది."

---డా. సరళ గోపాలన్, వైద్యురాలు

కమలాహ్యారిస్.. అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన తొలిమహిళ, తొలి భారత-అమెరికన్, తొలి ఆసియన్ మహిళ. సెనేట్‌లో ఉన్న ముగ్గురు ఆసియన్ అమెరికన్లలో 56 ఏళ్ల కమలా హ్యారిస్ ఒకరు. శాన్‌ఫ్రాన్సిస్కో అటార్నీ బాధ్యతలు చేపట్టిన తొలి ఆఫ్రికన్ అమెరిన్‌, తొలి భారత సంతతికి చెందిన వ్యక్తిగా కమలా హ్యారిస్‌ పేరిట మరో రికార్డు ఉంది. ఆమెకు ది ఫిమేల్ బరాక్ ఒబామా అన్న పేరూ ఉంది.

కమలా హ్యారిస్.. వైట్‌ హౌజ్‌లో నాయకురాలి స్థాయికి ఎదగడం పైంగనాడు-తులసేంద్రపురానికే కాదు...భారతదేశం మొత్తానికి గర్వకారణం.

ఇదీ చూడండి: చదువులో ఫెయిల్​ కానీ సరికొత్త బైక్ ఆవిష్కరణ

ABOUT THE AUTHOR

...view details