తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గెలుపు వేటలో... తమిళనాట చీలికల బాట

ఎన్నికలు సమీపించే కొద్దీ తమిళనాడులో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మొదట కూటమిగా ఏర్పడిన పార్టీలు సీట్ల పంపకాల విషయానికి వచ్చే సరికి చీలిపోతున్నాయి. గెలుపే లక్ష్యంగా కొత్త పార్టీలతో జతకడుతున్నాయి. ఇలా జరగడం తమిళనాట కొత్తేమీ కాదు. గతంలో కూడా ఇలాంటివి చాలానే జరిగాయి. దీంతో కూటముల స్వరూపం మారిపోతోంది.

The path of rifts in the hunt for victory .. Tamil politics infocus
గెలుపు వేటలో... తమిళనాట చీలికల బాట

By

Published : Mar 16, 2021, 10:12 AM IST

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్నది నానుడి! దానికి అచ్చమైన ఉదాహరణగా నిలుస్తున్నాయి తమిళ రాజకీయాలు. ఎన్నికలు సమీపించే కొద్దీ ఆ రాష్ట్రంలో సమీకరణాలు మారుతున్నాయి. పరిస్థితులు వేడెక్కుతున్నాయి. సీట్ల పంపకాల్లో విభేదాలు పార్టీల మధ్య కుంపట్లు రాజేస్తున్నాయి. కూటముల్లో చీలికలకు కారణమవుతున్నాయి. మిత్రపక్షాల నుంచి ఎక్కువ సీట్లు ఆశించి భంగపడ్డ పలు పక్షాలు కొత్త పార్టీలతో జత కడుతున్నాయి. దీంతో కూటముల స్వరూపం మారిపోతోంది. తమిళనాడులో ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఇలాంటి చీలికలు కనిపిస్తుండటం గమనార్హం.

2016 ఎన్నికల్లో..
ఐదేళ్ల క్రితం నాటి ఎన్నికల్లో.. అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమిలో సినీనటుడు శరత్‌ కుమార్‌ స్థాపించిన సమత్వ మక్కల్‌ కట్చితో కలిపి మొత్తం ఏడు చిన్న పార్టీలు ఉన్నాయి. డీఎంకే నాయకత్వంలోని కూటమిలో కాంగ్రెస్‌, ఐయూఎంఎల్‌తో పాటు ఎనిమిది చిన్న పార్టీలు చేరాయి. పీఎంకే ఒంటరిగా పోటీ చేసింది. ఇక ఎండీఎంకే నేతృత్వంలో ఏర్పడ్డ కూటమిలో టీఎంసీ, డీఎండీకే, కమ్యూనిస్టు పార్టీలు, మరో రెండు పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. భాజపా రెండు చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత నాయకత్వంలో నాటి ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి విజయం సాధించింది. కూటమి అభ్యర్థులందరూ రెండాకుల గుర్తుపై పోటీ చేశారు. 234 శాసనసభ స్థానాలకుగాను 136 చోట్ల వారు గెలుపొందారు.

మూడేళ్లకే మార్పులు
2019 సార్వత్రిక ఎన్నికల సమయానికి తమిళనాట కూటముల స్వరూపం మారిపోయింది. 2016లో ఎండీఎంకే కూటమిలో ఉన్న డీఎండీకే, టీఎంసీ దాన్నుంచి బయటికొచ్చేశాయి. అన్నాడీఎంకే కూటమిలో కలిశాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన భాజపా కూడా అన్నాడీఎంకేతో చేతులు కలిపింది. కమ్యూనిస్టు పార్టీలు, విడుదలై చిరుతైగళ్‌ కట్చి, ఎండీఎంకే పార్టీలు డీఎంకే కూటమిలో చేరాయి. కాంగ్రెస్‌ మాత్రం డీఎంకే మిత్రపక్షంగా కొనసాగింది. కమల్‌హాసన్‌ నేతృత్వంలోని మక్కల్‌ నీది మయ్యమ్‌ (ఎంఎన్‌ఎం), పలు ఇతర చిన్న పార్టీలు ఎన్నికల బరిలో దిగాయి. టీటీవీ దినకరన్‌ పార్టీ ఏఎంఎంకే కూడా చిన్న పార్టీలతో కలిసి పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో డీఎంకే కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 39 లోక్‌సభ స్థానాలకుగాను 38 సీట్లను దక్కించుకుంది. అన్నాడీఎంకే కూటమి ఒకే ఒక్క స్థానానికి పరిమితమైంది.
మళ్లీ మారిన సమీకరణాలు
ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి రాష్ట్రంలో కూటముల స్వరూపం మరోసారి మారింది. డీఎండీకేతో పాటు మరో రెండు పార్టీలు అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమికి టాటా చెప్పేశాయి. 2016లో ఆ కూటమిలో ఏడు పార్టీలు ఉండగా.. ఇప్పుడు అన్నాడీఎంకేతో పాటు పీఎంకే, భాజపా మాత్రమే మిగిలాయి. డీఎంకే నాయకత్వంలోని కూటమి నుంచి ఇండియా జననాయగ కట్చి (ఐజేకే) బయటికొచ్చి, తొలుత సమత్వ మక్కల్‌ కట్చితో చేతులు కలిపింది. ఆపై ఈ రెండు పక్షాలు, మరికొన్ని చిన్న పార్టీలు ఎంఎన్‌ఎం నేతృత్వంలోని కూటమిలో కలిశాయి. కాంగ్రెస్‌, వామపక్షాలు, వీసీకే, ఎండీఎంకే మాత్రం డీఎంకేతో కలిసి సాగుతున్నాయి. అన్నాడీఎంకే కూటమి నుంచి వైదొలిగిన విజయ్‌కాంత్‌ నేతృత్వంలోని డీఎండీకే ఒంటరి పోటీ దిశగా అడుగులు వేస్తోంది. మరోవైపు- ఏఎంఎంకే నాయకత్వంలోని కూటమిలో ఎంఐఎం సహా 4 పార్టీలు భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. సినీ నటుడు సీమాన్‌ నేతృత్వంలోని నామ్‌ తమిళర్‌ కట్చి (ఎన్‌టీకే) ఒంటరిగా పోటీ చేస్తోంది. మారిన సమీకరణాల నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికలు అన్నా డీఎంకే, డీఎంకే, ఎంఎన్‌ఎం, ఏఎంఎంకే కూటముల మధ్య చతుర్ముఖ పోటీగా తయారైంది!

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details