కర్ణాటక నూతన ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై.. తొలి రోజే ఆ రాష్ట్ర ప్రజలపై వరాల జల్లు కురిపించారు. రూ. 1000గా ఉన్న వృద్ధాప్య పింఛన్‌ను రూ. 200 మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే రూ.600గా ఉన్న వితంతు పింఛన్‌ను రూ. 800 చేస్తున్నట్లు ప్రకటించారు. దివ్యాంగుల పింఛన్‌ను మరో రూ. 200 పెంచుతున్నట్లు వెల్లడించారు.
సంధ్యా సురక్ష పథకం కింద పెంచిన వృద్ధాప్య పింఛన్‌తో ప్రభుత్వంపై అదనంగా మరో రూ.863.52 కోట్ల భారం పడుతుందని.. దీంతో 35.98 లక్షల మంది లబ్ధిపొందుతారని బొమ్మై తెలిపారు. కరోనా కష్టకాలంలో ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ.. నిధులను సమర్థంగా వినియోగించుకుంటామని అన్నారు.
ప్రభుత్వ అజెండాను మంత్రివర్గానికి, అధికారులకు వివరించాను. ప్రధానంగా మా ముందున్న సమస్యలు కరోనా, వరదలు. వీటిని సమర్థవంతగా ఎదుర్కోవాలి. అంతేగాకుండా వ్యవసాయ నేపథ్యం ఉన్న యువతకు ప్రత్యేకంగా రూ. వెయ్యి కోట్లతో స్కాలర్షిప్ను తీసుకొస్తాము.
-బసవరాజ్ బొమ్మై, కర్ణాటక ముఖ్యమంత్రి