మానవ పరిణామ క్రమాన్ని ప్రతిపాదించిన సిద్ధాంతకర్త డార్విన్ను ఒకప్పుడు సాధారణ విద్యార్థిగా పరిగణించారు. బల్బు కనిపెట్టి మానవ జీవితాల్లో వెలుగు నింపిన థామస్ అల్వా ఎడిసన్‌ను.. తెలివితక్కువ వాడన్నారు. కానీ.. వారు ఎవరూ చేరుకోలేనంత ఎత్తుకు ఎదిగారు. వైఫల్యం.. విజయానికి తొలి మెట్టు అనడానికి వీరి విజయ గాథలే చక్కటి ఉదాహరణలు. ఆ కోవలోకే వస్తారు మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి. ఇంగ్లిష్‌లో ఫెయిల్ అయినా.. దృఢ సంకల్పంతో ఐపీఎస్ పాసయ్యారు. ఆయనే.. ప్రస్తుతం బంగాల్లోని జల్పాయ్గుడి జిల్లా పోలీసు సూపరింటెండెట్‌గా సేవలు అందిస్తున్న.. ఉమేష్ గణపత్ ఖండ్‌బహలే.
మహారాష్ట్రకు చెందిన ఉమేష్ గణపత్.. పదో తరగతి తర్వాత.. ఇంటర్లో జాయిన్ అయ్యారు. అయితే, 2003లో ఇంటర్ ఇంగ్లిష్‌లో 21 మార్కులు తెచ్చుకుని ఫెయిల్ అయ్యారు. అయినా నిరాశ చెందలేదు. చదువు ఆపేసి.. తన తండ్రితో వ్యవసాయం చేయాలనుకున్నారు. ఆ తర్వాత తన స్నేహితుల ప్రొత్సాహంతో మళ్లీ చదువుపై దృష్టి పెట్టారు. అలా మహారాష్ట్ర ఓపెన్ యూనివర్సిటీలో ఇంగ్లిష్ లిటరేచర్‌లో డిగ్రీ పూర్తి చేశారు. దీంతో పాటు బీడీ, బీఎస్సీ హార్టికల్చర్ కూడా పూర్తి చేశారు. ఆ తర్వాత ఇంగ్లిష్‌లో మాస్టర్స్ చేశారు. అలా చదువుతున్న సమయంలోనే మహారాష్ట్రలో ఎస్ఐ పరీక్ష రాశారు. అందులో మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగం సాధించారు. ఆ ఉత్సాహంతోనే యూపీఎస్సీ పరీక్ష రాశారు. అందులో 704వ ర్యాంక్ సాధించి.. ఐపీఎస్‌గా సెలెక్ట్ అయ్యారు.