Nagaland insurgency: నాగాలాండ్ వివాదం ఈనాటిది కాదు. దశాబ్దాలుగా ఇది భారత నేలపై విషాన్ని చిమ్ముతూనే ఉంది. భారత్‌లో అత్యంత సుదీర్ఘ, రక్తసిక్త ఘర్షణగా ఇది నిలిచిపోయింది. దాడులు, ప్రతిదాడులు, శాంతి చర్చలు, కాల్పుల విరమణల నడుమ ఇది కశ్మీర్ వేర్పాటువాదం కన్నా ఎక్కువ కాలం రగిలింది. సంక్లిష్టమైన ఈ వివాదానికి బ్రిటిష్ హయాంలోనే బీజాలు పడ్డాయి. చైనా, పాకిస్థాన్ వంటి దేశాలు ఆజ్యం పోయడంతో ఈ అగ్నికీలలు ఆరడంలేదు. కొండలు, అడవులతో నిండిన భౌగోళిక ప్రాంతం, సరిహద్దులను ఆసరాగా చేసుకొని.. తీవ్రవాదులు భారత్‌లో దాడులు చేసి, మయన్మార్‌కు పరారవుతున్నారు. తాజాగా మాన్ ప్రాంతంలోజరిగిన కాల్పుల ఘటనతోనాగా వివాదం మరోసారి చర్చనీయాంశమైంది. ఆ నెత్తుటి చారికల్ని తడిమిచూసుకునే పరిస్థితుల్ని కల్పించింది.
ఏమిటీ వివాదం?
Nagaland dispute: 1826లో బ్రిటిష్ ప్రభుత్వం అసోంను ఆక్రమించింది. 1881లో నాగాహిల్స్ కూడా బ్రిటిష్ ఇండియాలో భాగమైంది. దీన్ని నాగా తెగలు వ్యతిరేకించాయి. 1918లో 'నాగా క్లబ్' ఏర్పాటు ద్వారా తమ వ్యతిరేకతను తొలిసారిగా ప్రకటించాయి. తమ భవితవ్యాన్ని తేల్చుకునే హక్కు తమకే ఇవ్వాలని 1929లో సైమన్ కమిషన్‌ను ఈ క్లబ్ కోరింది. 1946లో నాగా నేషనల్ కౌన్సిల్ (ఎన్ఎన్సీ) ఏర్పాటైంది. తమ తెగవారు నివసిస్తున్న ప్రాంతాలతో స్వతంత్ర నాగా దేశాన్ని స్థాపించాలని ఈ సంస్థ లక్ష్యంగా పెట్టుకొంది. 1947 ఆగస్టు 14న అంగమి జాపు ఫిజో నేతృత్వంలోని ఎన్ఎన్సీ స్వాతంత్య్రం కూడా ప్రకటించుకుంది.
ఇదీ చూడండి:నాగాలాండ్ కాల్పుల్లో 14కు చేరిన మృతుల సంఖ్య- హై అలర్ట్!
సాయుధ ఉద్యమం
Nagaland separatist movement: 1952 మార్చి 22న ఫిజో.. నాగా ఫెడరల్ గవర్న్మెంట్ (ఎన్‌ఎఫ్‌జీ), నాగా ఫెడరల్ ఆర్మీ (ఎన్ఎఫ్ఏ) పేరుతో ముఠాలను ఏర్పాటుచేశారు. ఈ వేర్పాటువాదులు భారీగా హింసకు పాల్పడ్డారు. వీరిని అణచివేయడానికి భారత ప్రభుత్వం 1955లో సైన్యాన్ని పంపింది. 1958లో సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని తెచ్చింది. అప్పట్నుంచి ఈ చట్టంపై వివాదం రగులుతూనే ఉంది. దీన్ని రద్దుచేయాలని వేర్పాటువాద గ్రూపులు ఉద్యమిస్తూనే ఉన్నాయి.
నాడే శాంతి ప్రక్రియ
9 Point agreement nagaland:1947 జూన్ 29న నాటి అసోం గవర్నర్ అక్బర్ హైదరీ.. మధ్యవర్తులతో 9 సూత్రాల ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దీన్ని ఫిజో తిరస్కరించారు. అసోంలోని నాగా హిల్స్ జిల్లాను 1963లో నాగాలాండ్ పేరుతో ప్రత్యేక రాష్ట్రంగా కేంద్రం ఏర్పాటు చేసింది. ఎన్ఈఎఫ్ఏలో భాగంగా ఉన్న టువెన్సాంగ్ ప్రాంతాన్నీ దీనికి జోడించింది. ఆ మరుసటి సంవత్సరం ఏప్రిల్‌లో ఒక శాంతి మిషన్‌ను ఏర్పాటు చేసింది. అదే ఏడాది సెప్టెంబరులో సైనిక చర్యలు ఆపేసేలా ఎన్ఎన్సీ, ప్రభుత్వం ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే ఎన్ఎన్సీ/ఎన్‌ఎఫ్‌జీ/ఎన్ఎఫ్ఏ హింసాత్మక కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉన్నాయి. ఆరు విడతలుగా చర్చలు జరిగినప్పటికీ ఎలాంటి ఫలితాన్ని ఇవ్వకపోవడం వల్ల 1967లో శాంతి మిషన్‌కు స్వస్తి పలికారు. అనంతరం తీవ్రవాదుల వేటకు సైనిక చర్య ప్రారంభమైంది.