Lok Sabha Secretariat bulletin: కడప ఎంపీ అవినాశ్ ను సీబీఐ అరెస్టు చేసిన విషయాన్ని ధ్రువీకరిస్తూ.. లోక్‌సభ సచివాలయం బులెటిన్ విడుదల చేసింది. వైఎస్ వివేకా హత్య కేసులో జూన్3న అవినాశ్‌ను అరెస్టు చేసి వెంటనే విడుదలచేశామని లోక్‌సభ సచివాలయానికి సీబీఐ లేఖ ద్వారా సమాచారమిచ్చింది. అవినాశ్‌ను రూ.5 లక్షల పూచీకత్తు, 2 ష్యూరిటీలతో విడుదల చేశామన్న సీబీఐ.. అరెస్టు చేస్తే వెంటనే బెయిల్ ఇవ్వాలని హైకోర్టు గతంలోనే ఆదేశించిందని పేర్కొంది. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు విడుదల చేశామన్న సీబీఐ లేఖ నిన్న తమకు అందినట్లుగా లోక్‌సభ సచివాలయం తెలిపింది.
LokSabha Secretariat bulletin: అవినాష్ రెడ్డి అరెస్టుపై బులెటిన్ విడుదల చేసిన లోక్‌సభ - సీబీఐ విచారణ
Lok Sabha Secretariat bulletin: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుల 8వ నిందితుడైన కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసి విడుదల చేసినట్లు లోక్‌సభ సచివాలయం వెల్లడించింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు విడుదల చేశామన్న సీబీఐ లేఖ నిన్న తమకు అందినట్లుగా లోక్‌సభ సచివాలయం బులెటిన్ ద్వారా తెలిపింది.
విచారణ సమయంలోనే అరెస్టు.. వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్‌రెడ్డిని ఎనిమిదో నిందితుడిగా చేర్చిన సీబీఐ.. జూన్ 3 వ తేదీన విచారణకు హాజరైన సమయంలో అరెస్టు చేసింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అనుసరిస్తూ... వెంటనే పూచీకత్తుపై విడుదల చేసింది. కాగా, ఇదే విషయాన్ని లోక్ సభ సచివాలయానికి సమాచారమిస్తూ ఈ నెల 3న సీబీఐ లేఖ రాసింది.రూ.5లక్షల చొప్పున రెండు పూచీకత్తులుతీసుకున్నట్లు వెల్లడించింది.
అరెస్టు భయంతో హైడ్రామా... హత్య కేసులో మొదట్లో సీబీఐ పిలిచిన వెంటనే విచారణకు హాజరైన అవినాష్‌రెడ్డి.. తన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ తర్వాత గైర్హాజరవుతూ వచ్చారు. అరెస్ట్ భయంతో ఏదో ఒక సాకు చెబుతూ విచారణ నుంచి తప్పించుకున్నారు. ఈ క్రమంలో గత నెల కర్నూలులో నాటకీయ పరిణామాలు చోటుచేసకున్నాయి. తన తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నందున రాలేనని అవినాష్ రెడ్డి తెలిపారు. సీబీఐ బృందం కర్నూలుకు వెళ్లగా.. అరెస్టు చేయకుండా తన అనుచరులను, వైఎస్సార్సీపీ కార్యకర్తలను రప్పించి ఆసుపత్రి పరిసరాల్లో మొహరించారు. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలను సాకుగా చూపుతూ రాష్ట్ర పోలీసులు సహకరించకపోవడంతో సీబీఐ వెనుదిరిగాల్సిన పరిస్థితి కల్పించారు. కాగా, అంతకు ముందు తెలంగాణ హైకోర్టుకు వేసవి సెలవులు ఉండటంతో.. అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీం ఆదేశాల మేరకు అవినాష్ రెడ్డి వాదనలను విన్న హైకోర్టు.. షరతులతో కూడిన ముందస్తు బెయిలు మంజూరు చేసింది. సీబీఐ అరెస్ట్ చేయాల్సి వస్తే పూచీకత్తులు తీసుకొని వెంటనే విడుదల చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 3న సీబీఐ కార్యాలయానికి విచారణకు వచ్చిన అవినాష్ రెడ్డిని సాంకేతికంగా అరెస్ట్ చేసి, పూచీకత్తులు తీసుకుని విడుదల చేసింది. కానీ, ఆ విషయాన్ని వెల్లడించకుండా సీబీఐ, అవినాష్‌రెడ్డి గోప్యత పాటించారు.