బంగాల్ నుంచి టాటా మోటార్స్ వైదొలిగి సుమారు 13 ఏళ్లవుతోంది. ఇప్పటికీ ఆ రాష్ట్రం 'పరిశ్రమల వ్యతిరేకి'గా పడిన ముద్రను చెరిపేసుకోలేక పోయింది. తయారీ రంగ సంస్థలు రాష్ట్రంలోకి రాలేని పరిస్థితిని ఇంకా మారలేదు. ప్రభుత్వం ఎన్ని పెట్టుబడి సదస్సులు నిర్వహించినా పెద్దగా ఫలితం లేదు. ఇప్పుడు ఇదే అంశం ఎన్నికల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కంకణం కట్టుకున్న భాజపా ఈ విషయాన్ని ప్రచారంలో పదేపదే ప్రస్తావిస్తోంది.
చారిత్రక కారణం..
రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు సంస్థలు ముందుకు రాకపోవడానికి కారణం రాష్ట్ర చరిత్రలోనే ఉంది. అందులో టాటా మోటార్స్ ఘట్టం ముఖ్యమైనది.
నానో కార్ల తయారీ కోసం బంగాల్లోని సింగూర్‌లో ఫ్యాక్టరీ నిర్మించాలని టాటా మోటార్స్ భావించింది. ఇందుకోసం అప్పటి వామపక్ష ప్రభుత్వం 997 ఎకరాల భూమిని కేటాయించింది. బ్రిటీష్ కాలానికి చెందిన 1894 భూసేకరణ చట్టం ప్రకారం.. ఈ భూమిని సేకరించడంపై వివాదం చెలరేగింది. అప్పటి విపక్ష నేత మమతా బెనర్జీ దీన్ని తీవ్రంగా తప్పుబడుతూ భారీ నిరసనలు చేపట్టారు. సారవంతమైన నేలను ఫ్యాక్టరీ కోసం సేకరించడాన్ని నిరసిస్తూ.. 25 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. ఈ ఆందోళనలు రక్తపాతానికి దారితీశాయి. రాజకీయ దుమారం తారస్థాయికి చేరడం వల్ల ప్లాంటును సింగూరు నుంచి గుజరాత్‌కు తరలించింది టాటా మోటార్స్.
ఇదీ చదవండి:బంగాల్ దంగల్: నందిగ్రామ్‌లో మళ్లీ ఆనాటి రక్తపాతం!
మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చాక ఈ భూమిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఓ చట్టాన్ని రూపొందించారు. దీనిపై టాటా మోటార్స్ కోర్టుకు వెళ్లింది. విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. 997 ఎకరాల వ్యవసాయ భూమిని తిరిగి సొంత యజమానులకు అప్పగించాలని ఆదేశించింది.
ఇలా.. పరిశ్రమల విశ్వాసాన్ని బంగాల్ ప్రభుత్వం కోల్పోయినట్లైంది. పారిశ్రామికీకరణ కుంటుపడింది.
బుద్ధదేవ్ ప్రయత్నించినా...
రాష్ట్రంలో పెట్టుబడుల విషయంపై ప్రభుత్వం నుంచి అధిక శ్రద్ధ కనిపించింది బుద్ధదేవ్ భట్టాచార్య కాలంలోనే. బంగాల్లో వామపక్షాలకు ఉన్న పరిశ్రమల వ్యతిరేక ముద్రను తుడిచేయాలని బుద్ధదేవ్ ఆశించారు. వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తూనే పరిశ్రమలే భవిష్యత్తు అనే భావనను ప్రజల్లో పెంపొందించాలనుకున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావాలని తీవ్ర ప్రయత్నాలు చేశారు. పెట్టుబడుల కోసం ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ పర్యటనలు చేశారు. అప్పటి రాష్ట్ర సెక్రెటేరియట్ అయిన 'రచయితల భవనం'లో 'పరిశ్రమలు-పెట్టుబడులు' అనే రెండు పదాలే తరచుగా వినిపించేవి.
ఇదీ చదవండి:బంగాల్ బరి: అలజడుల నందిగ్రామ్‌లో గెలుపెవరిది?
అయితే, బుద్ధదేవ్ ప్రయత్నించినా క్షేత్రస్థాయి పరిస్థితుల్లో మాత్రం మార్పు లేదు. ఆయన స్వప్నం కార్యరూపం దాల్చలేదు. పెద్ద పరిశ్రమలేవీ రాష్ట్రానికి రాకపోవడం అటుంచితే.. సింగూరు, నందిగ్రామ్ హింసకాండ తాలూకు చేదు జ్ఞాపకాలు రాష్ట్రాన్ని వెంటాడటం ఆగలేదు.