తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జాతీయోద్యమంలో ఆఖరి సమ్మెట క్విట్‌ ఇండియా

మహాత్మాగాంధీ ఇచ్చిన పిలుపునకు ఉత్తేజితులైన ప్రజలు ఆగస్టు 9 నుంచి క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు. అయిదేళ్లు తిరిగేసరికల్లా దేశానికి స్వాతంత్య్రం సాధించారు. భారత్‌ ఛోడో అంటూ బ్రిటిష్‌ పాలకులపై గాంధీజీ చేసిన గర్జన ప్రజల్లో పూర్ణ స్వరాజ్యం సాధించాలన్న ఆకాంక్షను బలంగా నాటి స్వాతంత్య్ర ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పింది.

quit india
తిరగబడ్డ భరత గడ్డ

By

Published : Aug 9, 2021, 6:57 AM IST

Updated : Aug 9, 2021, 9:53 AM IST

సమ్మెలు, హర్తాళ్లు...
ఉద్యమాలు, చర్చలు...
ఇలా సా....గుతున్న జాతీయోద్యమంలో అసలైన ఆఖరి సమ్మెట పోటు 1942 ఆగస్టులో పడింది!
అహింస వీరుడి నోటి నుంచి...
ఇక విజయమో వీర స్వర్గమో...
అంటూ వచ్చిన వ్యూహాత్మక గర్జన... యావత్‌ భారతావనని ఉప్పెనై తాకింది!
గుండెగుండెనూ కదిలించింది!
తెల్లవాడి గుండెలదిరేలా చేసింది!
బ్రిటిష్‌ సామ్రాజ్యంపై రవి అస్తమించేందుకు...
స్వాతంత్య్ర భారతావని ఉదయించేందుకు శంఖం మోగిన రోజు..
అదే ఆగస్టు 9... భారత్‌ ఛోడో...
క్విట్‌ ఇండియా ఉద్యమరోజు...

బ్రిటిష్‌ వలస పాలనకు చరమాంకం పలికిన ఘట్టం- క్విట్‌ ఇండియా ఉద్యమం. 1942 ఆగస్టు 8న విజయమో వీరస్వర్గమో అంటూ మహాత్మాగాంధీ ఇచ్చిన పిలుపునకు ఉత్తేజితులైన ప్రజలు ఆగస్టు 9 నుంచి ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు. అయిదేళ్లు తిరిగేసరికల్లా దేశానికి స్వాతంత్య్రం సాధించారు. భారత్‌ ఛోడో (క్విట్‌ ఇండియా) అంటూ బ్రిటిష్‌ పాలకులపై గాంధీజీ చేసిన గర్జన ప్రజల్లో పూర్ణ స్వరాజ్యం సాధించాలన్న ఆకాంక్షను బలంగా నాటి స్వాతంత్య్ర ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పింది. అంతవరకు భారతదేశాన్ని ఉక్కుపిడికిలితో పాలించిన బ్రిటిష్‌ వారి బింకాన్ని చెదరగొట్టిన ఘనత క్విట్‌ ఇండియా ఉద్యమానిదే.

సమరం ఇచ్చిన సదవకాశం..

వలస పాలకులను అదను చూసి దెబ్బకొట్టిన ఉద్యమం- క్విట్‌ ఇండియా! తమది రవి అస్తమించని సామ్రాజ్యమని గొప్పలు చెప్పుకొన్న బ్రిటిష్‌ వారికి రెండో ప్రపంచ యుద్ధంలో గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. 1939లో హిట్లర్‌ నాయకత్వంలో నాజీ జర్మనీ ప్రారంభించిన ఈ యుద్ధంలో ఐరోపాలో బ్రిటిష్‌ సేనలు మట్టికరిచాయి. బ్రిటిష్‌ వారు బతుకు జీవుడా అంటూ ఫ్రాన్స్‌ లోని డన్‌ కర్క్‌ నుంచి నౌకల్లో స్వదేశానికి పరారయ్యారు. తూర్పు నుంచి జపాన్‌ గండం ముంచుకొచ్చింది. ఆసియాలో బ్రిటిష్‌ సామ్రాజ్య అంతర్భాగాలైన మలయా, సింగపూర్‌, ఇండోనేసియా, పాపువా న్యూగినియా, బర్మాల నుంచి బ్రిటిష్‌ సేనలను పారదోలిన తరవాత జపాన్‌ ఈశాన్య భారత్‌ పొలిమేరల దాకా దూసుకొచ్చింది. ఈ పోరులో బ్రిటిష్‌ వారికి భారీ ప్రాణ నష్టం జరిగింది. ఇక తమ సామ్రాజ్య కిరీటంలో కలికితురాయి అయిన భారతదేశాన్ని జపనీయులు కైవసం చేసుకోనున్నారని బ్రిటిష్‌ వారు బెంబేలెత్తారు. మరోవైపు హిట్లర్‌ బ్రిటన్‌పై యుద్ధ విమానాలతో బాంబులు కురిపిస్తున్నాడు, రాకెట్లు ప్రయోగిస్తున్నాడు. ఇక ఏ క్షణాన్నైనా బ్రిటన్‌లోకి నాజీ జర్మనీ సేనలు చొచ్చుకొస్తాయని భయాందోళనలు పెరిగాయి. ఆసియా, ఆఫ్రికా, ఐరోపాల నుంచి ముప్పేట దాడితో బ్రిటన్‌ ఉక్కిరిబిక్కిరవడం గమనించిన భారతీయులు, తెల్లవాడు అజేయుడు కాడని గ్రహించారు. ఆసియాలో జపాన్‌ దూకుడును అడ్డుకోవడానికి భారతీయుల మనఃపూర్వక సహకారం కోరాలని నాటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్‌ డి. రూజ్‌ వెల్ట్‌, చైనా అధ్యక్షుడు చాంగ్‌ కై షేక్‌, సోవియట్‌ అధినేత స్టాలిన్‌ బ్రిటన్‌కు సలహా ఇచ్చారు. బ్రిటిష్‌ ప్రతిపక్షమైన లేబర్‌ పార్టీ కూడా తమ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్‌పై ఒత్తిడి తెచ్చింది.

క్రిప్స్‌ రాయబార నాటకం...

మిత్ర రాజ్యాల మాటను మన్నించినట్లు నటించడానికి చర్చిల్‌ నడుంకట్టారు. భారతీయుల పట్ల తనకున్న చిన్నచూపును కాసేపు పక్కనపెట్టారు. కాంగ్రెస్‌, ముస్లింలీగ్‌లతో రాయబారానికి 1942 మార్చిలో లేబర్‌ పార్టీ నాయకుడు సర్‌ స్టాఫర్డ్‌ క్రిప్స్‌ నాయకత్వంలో ప్రతినిధి వర్గాన్ని భారత్‌కు పంపారు. రెండో ప్రపంచ యుద్ధంలో తమకు సహకరిస్తే భారతదేశానికి సాధ్యమైనంత త్వరగా స్వయంపాలనను అందిస్తామని బ్రిటిష్‌ ప్రభుత్వం మొదట్లో బేరం పెట్టి, చివరికొచ్చేసరికి ప్లేటు ఫిరాయించింది. పూర్తి స్వరాజ్యం కాకుండా బ్రిటిష్‌ సామ్రాజ్యంలో అంతర్భాగంగా డొమినియన్‌ ప్రతిపత్తి ఇస్తామంటూ బేరం పెట్టింది. బ్రిటిష్‌ రాణికి విధేయమై ఉండాలని షరతు పెట్టింది. భారత్‌ నుంచి విడిపోదలచిన రాష్ట్రాలకు ఆ స్వేచ్ఛను ఇస్తామని ప్రతిపాదించింది. క్రిప్స్‌ రాయబారాన్ని కాంగ్రెస్‌ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. బ్రిటిష్‌ వారిలో నిజాయతీ లేదనీ, భారతీయులకు తమ భవితను తామే నిర్ణయించుకునే హక్కును ఇచ్చే ఉద్దేశం తెల్ల పాలకులకు ఏ కోశానా లేదనీ తేలిపోయింది. మార్చిలో క్రిప్స్‌ నిర్వాకం చూశాక, కాంగ్రెస్‌ ఇక ఉద్యమోన్ముఖమైంది. 1942 జులైలో వార్ధాలో సమావేశమైన కాంగ్రెస్‌ కార్యవర్గం బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని తీర్మానించింది.

ప్రజలే నాయకులుగా...

గోవాలియా మైదానంలో గాంధీజీ ప్రసంగం ముగిసిన కొన్ని గంటల్లోనే బ్రిటిష్‌ ప్రభుత్వం గాంధీజీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, అబుల్‌ కలాం ఆజాద్‌, సర్దార్‌ వల్లబ్‌భాయ్‌ పటేల్‌తో సహా యావత్‌ కాంగ్రెస్‌ నాయకత్వాన్ని కటకటాల వెనక్కు నెట్టింది. కాంగ్రెస్‌ను చట్టవిరుద్ధ సంస్థగా ప్రకటించి, దేశమంతటా ఆ పార్టీ కార్యాలయాలపై దాడులు చేసింది. పార్టీ నిధులను స్తంభింపజేసింది. నాయకుల ఆదేశాలు, సూచనలతో పనిలేకుండా ప్రజలే స్వయంగా ఉద్యమం ప్రారంభించారు. అసలే రెండో ప్రపంచ యుద్ధం వల్ల ధరలు పెరిగి నానా ఇక్కట్లపాలవుతున్న ప్రజల అసంతృఫ్తి, ఆగ్రహావేశాలు క్విట్‌ ఇండియా ఉద్యమంలో అగ్ని పర్వతంలా ప్రజ్వరిల్లాయి.

క్విట్‌ ఇండియా ఉద్యమంలో పోలీసులు, సైనికులు దాదాపు 50,000 మంది భారతీయులను హతమార్చారు.

- అప్పటి వైస్రాయ్‌ లిన్‌ లిథ్గోకు రాసిన లేఖలో రాం మనోహర్‌ లోహియా

గాంధీజీ గర్జన మంత్రం..

బొంబాయి గోవాలియా ట్యాంక్‌ మైదానంలో 1942 ఆగస్టు 8న మహాత్ముడు కాంగ్రెస్‌ అగ్ర నేతలతో కలసి స్వరాజ్యం కోసం పార్టీ కార్యవర్గ తీర్మానాన్ని ఆమోదించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో బ్రిటిష్‌ వారిని భారత్‌ ఛోడో (క్విట్‌ ఇండియా) అంటూ గద్దిస్తూ, భారతీయులు స్వాతంత్య్రం కోసం విజయమో వీరస్వర్గమో అన్నట్లు పోరాడాలని గాంధీజీ పిలుపు ఇచ్చారు. 'ఇప్పుడు నేను మీకు ఒక చిన్న మంత్రాన్ని ఉపదేశిస్తాను. దాన్ని మీ హృదయాల్లో బలంగా ప్రతిష్ఠించుకోవాలి. మీ ప్రతి శ్వాసలో అది ప్రతిధ్వనించాలి. విజయమో, వీరస్వర్గమో అన్నదే ఆ మంత్రం. మనం పరాయి పాలన నుంచి మాతృదేశాన్ని విముక్తం చేస్తాం లేదా ఆ పోరాటంలో ప్రాణాలు అర్పిస్తాం. అంతేతప్ప నిరంతర బానిసత్వంలో మగ్గిపోవడానికి ససేమిరా అంటాం ' అని గాంధీజీ పిలుపు ఇచ్చారు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో అన్ని వర్గాలూ పాలుపంచుకోవాలన్నారు. ప్రభుత్వోద్యోగులు బాహాటంగా కాంగ్రెస్‌ పార్టీకి విధేయత ప్రకటించాలన్నారు. సైనికులు తమ సొంత ప్రజలపై కాల్పులు జరపడానికి నిరాకరించాలనీ, సంస్థానాధీశులు విదేశీ పాలకులకు తలొగ్గడం కాకుండా తమ ప్రజల సార్వభౌమత్వాన్ని అంగీకరించాలని మహాత్ముడు కోరారు.

ఊరూ వాడా ఏకమై...

1942ఆగస్టు 9న బొంబాయి, పుణె, అహ్మదాబాద్‌ లలో లక్షల మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి పోలీసులతో ఘర్షణలకు దిగారు. 10వ తేదీన దిల్లీ, ఉత్తర్‌ ప్రదేశ్‌, బిహార్‌లలో నిరసనలు పెల్లుబికాయి. కాన్పుర్‌, పట్నా, వారణాసి, అలహాబాద్‌లలో ప్రజలు హర్తాళ్లు, ప్రదర్శనలు జరిపారు. తరవాత దేశమంతటా పల్లెలు, పట్టణాలకు ఉద్యమం వ్యాపించింది. ప్రజలు స్వచ్ఛందంగా సత్యాగ్రహాలు చేశారు. సెప్టెంబరు మధ్యనాటికల్లా పోలీసు స్టేషన్లు, కోర్టులు, రైల్వే స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు జరిగాయి. నగరాల్లో ఫ్యాక్టరీ కార్మికులు విధులకు దూరంగా ఉండిపోయారు. విద్యార్థులు పాఠశాలలను, కళాశాలలను వదలి ఉద్యమంలో మమేకమయ్యారు. కొంతమంది ఉద్యమకారులు రైలు పట్టాలను ఊడబెరికారు. పోలీసు స్టేషన్లను తగులబెట్టారు. వంతెనలను కూల్చేశారు. ఈ తరహా ఉద్యమం ఉత్తర్‌ ప్రదేశ్‌, బిహార్‌ లలో ఉద్ధృతమైంది. రైతులు తహశీలు పట్టణాలకు తరలివచ్చి ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు చేశారు. పట్నాలో సచివాలయంపై జాతీయ జెండాను ఎగురవేయడానికి వస్తున్న విద్యార్థులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఏడుగురు మరణించారు. దీనితో కోపోద్రిక్తులైన ప్రజలు పట్నా వీధుల్లో పోలీసులతో బాహాబాహీకి దిగారు. పట్నాలో రెండు రోజులపాటు ప్రభుత్వమనేదే లేకుండా పోయింది. బిహార్‌లో అనేక పట్టణాల్లో తెల్లవాళ్లపై దాడులు జరిగాయి. దక్షిణ భారతంలో కూడా ఉద్యమం ఉద్ధృత రూపం ధరించింది. దీంతో పోలీసులు, సైనికులు ఉద్యమకారులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. జనసమూహాలపై యుద్ధ విమానాలు, మరతుపాకులతో కాల్పులు జరిపారు. 1942 ఆగస్టు నుంచి డిసెంబరు వరకు వేలమందిని జైళ్లలోకి నెట్టారు. బ్రిటిష్‌ వలస పాలకులు ఎంతగా దమననీతి పాటించినా, సంపూర్ణ స్వాతంత్య్రం సాధించాలన్న భారతీయుల దృఢ సంకల్పం చెదరలేదు. క్విట్‌ ఇండియా వృథా కాలేదు.... అప్పుడే కాకున్నా.. మరో అయిదేళ్లలో బ్రిటిష్‌ సామ్రాజ్యం తోకముడవక తప్పలేదు.

ఇదీ చూడండి:సాగర జలాల్లో త్రినేత్రం- నౌకాదళానికి కొత్త శక్తి!

Last Updated : Aug 9, 2021, 9:53 AM IST

ABOUT THE AUTHOR

...view details