ఎవరినైనా తిట్టాలంటే గాడిదా అంటాం. తెలివితక్కువ వారనో, పనికిరాని వారనో భావన వచ్చేలా గాడిదా అనే నిందిస్తాం. కానీ 'గాడిదల వల్ల ఎంతో ఉపయోగం ఉంది. అవి ఎంతో తెలివైనవి... ఓర్పు కలిగిన జీవుల'ని అంటోంది భారత సైన్యం. దేశ రక్షణ విధుల్లో కంచర గాడిదల సహకారంతో సైన్యం ఎన్నో సమస్యలను అధిగమిస్తోంది. కొండలు, గుట్టలు, ఆక్సిజన్ అందని వాతావరణంలో సరకు రవాణాకు గాడిదలే ఆధారం. రెండేళ్ల వయసు నుంచే ఇవి విధుల్లోకి దిగుతాయి. పోషణ, శిక్షణ, చివరికి చనిపోయాక సైనిక లాంఛనాలతో వీడ్కోలు పలికే వరకూ వీటికి ఎంతో ప్రాధాన్యమిస్తారు. సైనికుల మాదిరే పతకాలు ప్రదానం చేస్తారు. అత్యాధునిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న ఈ రోజుల్లోనూ కొన్ని ప్రాంతాల్లో సరకు రవాణాకు గాడిదలే ఆధారం. కేవలం ఈస్ట్రన్ సెక్టారులోనే రోజుకు రెండున్నరవేల కిలోల సరకును ఇవి రవాణా చేస్తున్నాయి. భారత సైన్యం జంతువుల కోసం 'యానిమల్ ట్రాన్స్‌పోర్టు కాప్ (ఎ.టి)' పేరుతో పెద్ద విభాగమే ఏర్పాటు చేసింది. ప్రస్తుతం సైన్యం వద్ద అయిదువేలకు పైగా కంచర గాడిదలున్నాయి.సైన్యం కోసం మేలిమిజాతి కంచర గాడిదల ఉత్పత్తికి ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాబూగఢ్‌లో 1948లోనే ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశారు. ఇలాంటి జంతువులపై పరిశోధన, ఉత్పత్తికి హరియాణాలోని హిస్సార్‌లో 1986లో 'నేషనల్ రీసెర్చి సెంటర్ ఆన్ ఎక్వైన్ (ఎన్‌ఆర్‌సీఏ) పేరుతో మరో కేంద్రం నెలకొల్పారు. మగ గాడిద, ఆడ గుర్రాన్ని సంకరం చేయడం ద్వారా కంచర గాడిదలను ఉత్పత్తి చేస్తారు. అవి పుట్టిన ఏడాది నుంచే ప్రత్యేక తర్ఫీదు మొదలుపెడతారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని శహరన్‌పుర్, గుజరాత్‌లోని హెంపూర్‌లో శిక్షణ కేంద్రాలున్నాయి. ప్రతి గాడిదకూ ఒక హ్యాండ్లర్ ఉంటాడు. అతడి ఆదేశాలకు తగ్గట్టు పనిచేసేలా వాటికి శిక్షణ ఇస్తారు. యుద్ధం జరుగుతున్నా బెదరకుండా ముందుకు వెళ్లేలా, పేలుళ్ల వంటి శబ్దాలు కృత్రిమంగా సృష్టించి నడిపిస్తారు. ఏడాది కఠోర శిక్షణ అనంతరం సైన్యానికి అప్పగిస్తారు. సైన్యంలో వాటి బాగోగులు చూసేందుకు 'రిమౌంట్ అండ్ వెటర్నరీ కాప్' పేరుతో మరో విభాగం ఉంది.
రోజుకు 25 కి.మీ. నడక
ఒక్కో గాడిద 60 కిలోల బరువు మోస్తూ రోజుకు సగటున 25 కిలోమీటర్లు నడుస్తుంది. కార్గిల్ యుద్ధంలో సముద్రమట్టానికి 19 వేల అడుగుల ఎత్తున కంచర గాడిదలు విశేషంగా సేవలందించాయి. రోజూ విధుల ప్రారంభానికి గంట ముందు, పూర్తయిన తర్వాత హ్యాండ్లర్ తన పరిధిలోని గాడిద ఆరోగ్యాన్ని పరీక్షిస్తాడు. మంచి ఆహారం అందిస్తాడు. ముఖ్యంగా దాని కాళ్లను క్షుణ్ణంగా పరీశీలిస్తాడు. ఎక్కడైనా గాయాలుంటే చికిత్స చేయిస్తాడు. బాగా పనిచేసిన గాడిదలకు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కమెండేషన్ కార్డు, ఆర్మీ కమాండర్ కమెండేషన్ కార్డులను బహూకరిస్తున్నారు. అత్యుత్తమ సేవలు అందించిన వాటిపై నీలం రంగు జీన్ కప్పుతారు.
ఉద్యోగ విరమణ... స్మృతివనం