ఇప్పటి వరకు మనుషుల వివాహాలను చాలా వైభవంగా జరగటం అందరం చూశాం. అయితే ఈ మధ్య జంతువులకు కూడా ఘనంగా పెళ్లిళ్లు చేస్తున్నారు. ఔనండి బాబు! ఇది నిజమే. రెండు పెంపుడు శునకాలకు ఇరు కుటుంబ సభ్యులు అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. ఈ అరుదైన సంఘటన ఉత్తర్‌ప్రదేశ్ అలీగఢ్‌లో జరిగింది.
సుఖ్రావలి గ్రామానికి చెందిన దినేశ్ చౌదరికి ఎనిమిది నెలల వయసున్న పెంపుడు కుక్క ఉంది. దాని పేరు టామీ. అయితే టామీకి, అట్రౌలీలోని తిక్రి రాయ్‌పుర్ ఓయ్ నివాసి డాక్టర్ రాంప్రకాశ్ సింగ్‌కు చెందిన ఏడు నెలల ఆడ కుక్క జెల్లీతో మంచి అనుబంధం ఉంది. ఈ రెండు శునకాలు ఒకదానిని ఒకటి ఇష్టపడటం వల్ల రాంప్రకాశ్ సింగ్ తన ఆడ కుక్కను టామీకి ఇచ్చి వివాహం జరిపించేందుకు సుఖావళి వచ్చి సంబంధం మాట్లాడారు.
వైభవంగా పెంపుడు శునకాల వివాహం.. ఏడడుగులతో ఒక్కటైన జంట.. ఘనంగా ఊరేగింపు - టామీ జెల్లీ కుక్కల పెళ్లి వీడియో న్యూస్
ఉత్తర్‌ప్రదేశ్‌లో అరుదైన ఘటన వెలుగులోకి వచ్చింది. అలీగఢ్ జిల్లాలో అంగరంగ వైభవంగా పెంపుడు శునకాలకు వివాహం జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
జనవరి 14న మకర సంక్రాంతి సందర్భంగా టామీ, జెల్లీల వివాహం జరిపించారు. పెళ్లి కూతురు జెల్లీ తరపు బంధువులు సుఖ్రావలికి చేరుకుని.. వరుడు టామీకి తిలకం దిద్దారు. టామీకి పూలమాల వేసి పెళ్లికొడుకుగా తయారు చేశారు. డప్పుల మోత నడుమ టామీకి ఊరేగింపు నిర్వహించారు. పెళ్లికొడుకు టామీ ముందు వెళుతుండగా వెనుక ఇరు కుటుంబాలు ఆనందంతో డాన్స్‌లు చేశాయి.
కల్యాణ మండపం వరకు ఊరేగింపు నిర్వహించి.. పీటలు ఎక్కిన వధూవరులకు పూలమాలలు వేసి ఆశీర్వదించారు. వధూవరులుగా మారిన కుక్కలు రెండూ పండితుని సమక్షంలో ఏడు ప్రదక్షిణలు చేసి ఒకదానికొకటి ఆలింగనం చేసుకున్నాయి. తర్వాత నెయ్యితో తయారు చేసిన వంటకాలను వధూవరులకు, శునకాలకు వడ్డించారు. మహిళలు పాటలు ఆలపించారు. అనంతరం వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు.