Government is threatening CBI officials : ప్రభుత్వ వైఫల్యాలపై ఎవరైనా సామాజిక మాధ్యమాల్లో చిన్న పోస్టు పెట్టినా సరే.. ఆగమేఘాలపై వారింట్లో పోలీసులు ప్రత్యక్షమైపోతారు. ఎక్కడికి, ఎందుకు తీసుకెళ్తున్నారనే కనీస సమాచారం ఇవ్వకుండా బలవంతంగా ఎత్తుకెళ్లిపోతారు. అసలు వారు నిజంగా పోలీసులేనా? ఎవరైనా కిడ్నాప్ చేశారా అన్నంత అరాచకంగా వ్యవహరిస్తారు. సీఎం జగన్, ఆయన ప్రభుత్వ వైఫల్యాల్ని తూర్పారపడుతూ పోరాడే ప్రతిపక్ష నాయకులు, సామాజిక కార్యకర్తలపై కేసులు బనాయించి అర్ధ రాత్రీ, అపరాత్రీ అని చూడకుండా వారిపై దండయాత్రకు వెళ్తారు. ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసినట్లుగా వందల మంది పోలీసులను మోహరించి.. వారి ఇంటిని దిగ్బంధిస్తారు. గోడలు దూకుతారు, ఇళ్లల్లోకి చొరబడతారు. తలుపులు విరగ్గొట్టి మరీ అదుపులోకి తీసుకుని.. ఘోరమైన నేరానికి పాల్పడ్డ వారిలా క్షణాల్లో అరెస్టు చేసి తీసుకెళ్లిపోతారు. గత నాలుగేళ్లుగా జగన్ కనుసన్నలతో ఏపీ పోలీసులు చేస్తున్న నిర్వాకమిది.
అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తామని... ఇప్పటివరకూ సామాన్యులు, ప్రతిపక్ష పార్టీల నాయకులు, పౌర హక్కుల సంఘాల ప్రతినిధుల్ని టార్గెట్ చేసి వేధించిన పోలీసులు... ఇప్పుడు సీబీఐనే ముప్పుతిప్పలు పెడుతున్నారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఒక్కో చిక్కు ముడినీ విప్పుతూ.. తీగ లాగుతూ సీబీఐ పలువుర్ని అరెస్టు చేసింది. చివరకు ఈ కేసులో నిందితుడైన కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని అరెస్టు చేస్తామని కోర్టుకు నివేదించింది. ఈ తరుణంలో సీబీఐని జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం, రాష్ట్ర పోలీసులు, అధికార యంత్రాంగం, ప్రభుత్వ పెద్దలు ముప్పుతిప్పలు పెడుతున్నారు.
తాజాగా అవినాష్‌ను అరెస్టు చేయటానికి కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రి వద్దకు వెళ్లేందుకు సీబీఐ అధికారులు ప్రయత్నించగా వారిని దరిదాపుల్లోకి కూడా రానీయకుండా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు, వందల మంది మోహరించి.. దౌర్జన్యానికి తెగబడి, వీరంగం సృష్టించారు. అల్లరి మూకల్ని తరిమికొట్టాల్సిన రాష్ట్ర పోలీసులే వారికి వత్తాసు పలుకుతున్నారు.