జమ్ముకశ్మీర్‌లో ప్రతి కుటుంబానికి 'ఫ్యామిలీ ఐడెండిటీ కార్డు'ను అందించాలని అధికార యంత్రాంగం యోచిస్తోంది. జమ్ముకశ్మీర్‌లోని అన్ని కుటుంబాల డేటాబేస్‌ను రూపొందించాలని భావిస్తోంది. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికకు ఈ ప్రత్యేక ఐడీ కార్డు బాగా ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. ఈ కార్డులో అల్ఫా న్యూమరిక్ కోడ్ ఉంటుందని వెల్లడించారు.
జమ్ముకశ్మీర్‌లో ప్రతి కుటుంబానికి ఐడీ కార్డ్.. అందుకోసమేనట! - జమ్ముకశ్మీర్‌లో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ ఐడీ
జమ్ముకశ్మీర్‌లోని ప్రతి కుటుంబానికి 'ఫ్యామిలీ ఐడెంటిటీ కార్డు'ను అందించాలని అధికార యంత్రాంగం యోచిస్తోంది. ఈ కార్డు ద్వారా ప్రజలు సంక్షేమ పథకాలను సులువుగా పొందవచ్చని పేర్కొంది.
ఇటీవల రియాసీలో జరిగిన జాతీయ సదస్సులో జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్.. విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేశారు. విశ్వసనీయమైన డేటాబేస్‌ను రూపొందించే ప్రణాళికను ఆవిష్కరించారు. జమ్ముకశ్మీర్‌లోని ప్రతి కుటుంబానికి ఈ ఫ్యామిలీ ఐడీ కార్డును అందించనున్నట్లు అందులో పేర్కొన్నారు. ఎవరి వ్యక్తిగత గోప్యతకు భంగం కలగకుండా డేటా సేకరిస్తామని విజన్ డాక్యుమెంట్లో వివరించారు. ఈ ప్రత్యేక ఫ్యామిలీ ఐడీ కార్డు ఉంటే ప్రభుత్వ సేవలను పొందేందుకు మరే ఇతర పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేదని తెలిపారు.
ఈ నిర్ణయాన్ని భాజపా స్వాగతించగా.. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, ఇతర ప్రతిపక్షాలు తప్పుబట్టాయి. ఇప్పటికే ఆధార్ కార్డు ద్వారా ప్రజలు వారి డేటాను ప్రభుత్వానికి ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ గుర్తు చేసింది. దిల్లీ ఎయిమ్స్ సర్వర్లపై చైనా దాడి చేస్తోందని.. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల వ్యక్తిగత డేటాను ప్రభుత్వం సురక్షితంగా ఉంచడం పెద్ద సవాలని అభిప్రాయపడింది.
'ప్రభుత్వం పట్టించుకోని చాలా సమస్యలు జమ్ముకశ్మీర్‌లో చాలా ఉన్నాయి. వాటిపై దృష్టి సారించాలి. ఎవరిని గుర్తించడానికి ప్రభుత్వం ప్రత్యేక ఐడీ కార్డులను అందించాలని చూస్తోంది.' అని పీడీపీ నాయకుడు ఒకరు అన్నారు.