తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తండ్రి స్ఫూర్తితో.. 22మంది పేద బాలికలకు జీవితం

హాకీ క్రీడాకారుడిగా ఎంతో పేరుప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. ఆటకు వీడ్కోలు పలికాక విలాసవంతమైన జీవింతం వైపు కాకుండా.. ఏదైన మంచి పని చేయాలని సంకల్పించుకున్నాడు. తండ్రి ఇచ్చిన స్ఫూర్తితో ప్రభుత్వ పాఠాశాలల్లో చదివే 22 మంది అమ్మాయిలను దత్తత తీసుకుని.. వారికి అండగా నిలిచాడు. ఆయనే రోహ్​తక్​లోని బోహర్​కు చెందిన అజిత్​ నాందల్​. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన అజిత్​కు బాలికలను దత్తత తీసుకోవాలనే ఆలోచన ఎలా వచ్చింది?

hockey player Ajith nandal
అజిత్​ నాందల్

By

Published : Nov 26, 2020, 6:36 AM IST

Updated : Nov 26, 2020, 7:37 AM IST

అజిత్​ నాందల్, మాజీ హాకీ ప్లేయర్

ఈయన అజిత్ నాందల్. జాతీయ స్థాయి హాకీ ఆటగాడు. భారత హాకీ జట్టు సభ్యుడు. హరియాణా రోహ్‌తక్‌లోని బోహర్‌లో ప్రస్తుతం నివసిస్తున్నాడు. చిన్నవయసులోనే డబ్బు, పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు అజిత్. ఏ యువకుడైనా అన్ని విజయాలు సాధించిన తర్వాత జీవితాన్ని హాయిగా గడపాలనుకుంటాడు. సరదాలు, షికార్లు, ప్రపంచ పర్యటనలు అంటూ ఉల్లాసంగా జీవిస్తాడు. కానీ...అలాంటివారికంటే అజిత్ భిన్నం. క్రీడల నుంచి తప్పుకున్నాక, అజిత్ నాందల్ ఏకంగా 22 మంది అమ్మాయిలకు తండ్రిగా మారాడు. అంతమంది ఆడపిల్లలను దత్తత తీసుకుని, వారి బాధ్యతలు భుజానికెత్తుకున్నాడు. ఇతరులు చేసే పనికంటే నేనేం చేసినా విభిన్నంగా ఉండాలని చిన్నప్పటినుంచీ ఆరాటపడేవాడినని పేర్కొంటున్నాడు.

అజిత్ నాందల్ చేస్తున్న మంచిపని ఎంతోమందికి ఆదర్శం. మరి ఈ పని చేయాలన్న ఆలోచన అజిత్‌కు ఎలా వచ్చింది.? క్రీడలకు స్వస్తి చెప్పి, ఇంటికి తిరిగొచ్చాక ఏదైనా మంచి పని చేయాలని అజిత్ బలంగా అనుకున్నాడు. కానీ ఏం చేయాలో స్పష్టత లేదు. తన ఆలోచనను తండ్రికి వివరించగా... చుట్టుపక్కల గ్రామాల్లోని పేద ఆడపిల్లలకు సాయం చేయమని సలహా ఇస్తాడు. తండ్రి ఇచ్చిన స్ఫూర్తితో ప్రభుత్వ పాఠశాలలో చదివే 22 మంది అమ్మాయిలను దత్తత తీసుకున్నాడు అజిత్.

" మన దేశంలో ఎవరూ పెద్దగా పట్టించుకోని ఓ ప్రధాన సమస్య ఉందని మా నాన్న చెప్పారు. అదే పేద బాలికలు, కూలీల దీనస్థితి. కుదిరితే వాళ్లకోసం ఏదైనా చేయాలన్నది ఆయన ఆశయం. మా ఊర్లోని మా పాఠశాలకు వెళ్లాను. ఇక్కడికి చదువుకునేందుకు జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి అమ్మాయిలు వస్తారు. 21, 22 మంది ఆడపిల్లలను దత్తత తీసుకోవాలనుకుంటున్నానని ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్‌తో మాట్లాడాను. తల్లి, తండ్రి లేని పిల్లలు, ఆర్థికలేమి వల్ల 10, 12 తరగతుల తర్వాత బిడ్డకు పెళ్లి చేయాలనుకునే కుటుంబం నేపథ్యమున్న ఆడపిల్లలను దత్తత తీసుకోవాలనుకున్నాను. పాఠశాల నుంచి 22 మందిని వాళ్లే ఎంపిక చేశారు."

- అజిత్ నాందల్, మాజీ హాకీ ప్లేయర్

23 మంది కూతుర్లు..

తన కుమార్తెతో కలిసి, తనకు మొత్తంగా 23 మంది కూతుర్లని చెప్తున్నాడు అజిత్ నాందల్. వాళ్లంతా తమ జీవితాల్లో ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు కృషి చేస్తున్నాడు. ఈ అమ్మాయిలంతా కష్టపడి చదువుకోవడంతో పాటు...గుర్రపుస్వారీపైనా పట్టు సాధించారు. వీళ్లంతా తమ చిత్తశుద్ధితో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు అజిత్. ఈయన దత్తత తీసుకున్న అమ్మాయిలంతా ఎంతో ఉల్లాసంగా ఉంటారు. తాము జీవితంలో గుర్రపుస్వారీ చేస్తామని గానీ, పోలో ఆడతామనీ, జిమ్‌కు వెళ్తామని, మంచి దుస్తులు ధరిస్తామని ఎప్పుడూ కలలో కూడా అనుకోలేదని చెప్తున్నారు.

" అజిత్ అన్నయ్య నన్ను దత్తత తీసుకున్నాడు. నన్ను సొంత కూతురిలాగే చూసుకుంటానని, అంతా దగ్గరుండి చూసుకుంటానని చెప్పాడు. భోజనం, దుస్తులు, చదువు, క్రీడలకు సంబంధించిన అన్ని ఖర్చులు ఆయనే భరిస్తున్నాడు."

- సోనికా

పోలీసు కావాలనే లక్ష్యంతో..

12వ తరగతి చదువుతున్న సోనియా, పోలీసు అధికారి కావాలని కలలు గంటోంది. కానీ ఆమె కుటుంబం ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. కనీసం పన్నెండో తరగతైనా పూర్తిచేస్తానో లేదోనని అనుకునేది సోనియా. ప్రస్తుతం తన భవిష్యత్తు మీద పూర్తి భరోసాతో ఉంది.

" పోలీసు అవ్వాలన్నది నా కల. 12వ తరగతి కూడా చదువుతానన్న నమ్మకం ఉండేది కాదు. పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుంటే, తర్వాతి చదువులకు కావల్సిన డబ్బు మొత్తం తానే ఇస్తానని అజిత్ అన్నయ్య చెప్పాడు. నా కల నిజం చేసుకునేందుకు సాయం చేస్తానని చెప్పాడు."

- సోనియా

అజిత్​ రుణం తీర్చుకోలేము..

అజిత్ నాందల్ అందిస్తున్న సహకారానికి ఈ అమ్మాయిల తల్లిదండ్రులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. కలల్ని సాకారం చేసుకుంటున్న తమ పిల్లల కళ్లలో ఆనందం చూస్తే... అజిత్ నాందల్‌ రుణం ఎప్పటికీ తీర్చుకోలేమని అనిపిస్తుందని చెమర్చిన కళ్లతో చెప్తున్నారు.

" అన్ని ఖర్చులూ ఆయనే భరిస్తున్నాడు. పిల్లల దుస్తులే కాదు...ఇంటికి సంబంధించిన అన్ని అవసరాలకు డబ్బు అందజేస్తున్నాడు. మా అమ్మాయి చాలా బలహీనంగా కనిపిస్తుందని, రోజూ పాలు తాగేందుకు ఏర్పాట్లు చేశాడు. చాలా మంచి మనిషి."

- సునీత, విద్యార్థి తల్లి

అజిత్ నాందల్ చేస్తున్న పని అభినందనీయం. ఇప్పటికీ ఆడపిల్లను భారంగా భావించి, గర్భంలోనే చంపేస్తున్న సంకుచిత భావాలున్న వారున్నారు. అలాంటి పరిస్థితుల్లో అజిత్ నాందల్ జీవితం సమాజానికి ఆదర్శం. 22 మంది ఆడపిల్లల బాధ్యతలు భుజానికెత్తుకోవడమే కాదు...తమ కలలు నిజం చేసుకునేందుకు పూర్తి మద్దతు అందిస్తున్నాడు అజిత్ నాందల్.

ఇదీ చూడండి: కళకు ప్రాణం పోస్తున్న కానిస్టేబుల్

Last Updated : Nov 26, 2020, 7:37 AM IST

ABOUT THE AUTHOR

...view details